కోవిడ్‌‌తో మరణం.. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు: నారా భువనేశ్వరి

By Siva KodatiFirst Published May 29, 2021, 7:48 PM IST
Highlights

కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కోవిడ్‌తో చనిపోయి కుటుంబసభ్యులు ముందుకురాని అభాగ్యులు, అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. 

కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కోవిడ్‌తో చనిపోయి కుటుంబసభ్యులు ముందుకురాని అభాగ్యులు, అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. ఈ మేరకు ట్రస్టు ముఖ్య నిర్వాహకులు, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వివరాలు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వివిధ ఆసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడం, కొన్నిచోట్ల కరోనాతో మృతిచెందిన వారిని పట్టించుకోకుండా రోడ్ల పక్కన వదిలివేయడం పట్ల తాను కలత చెందానన్నారు. ఇలాంటి వారి చివరి మజిలీ గౌరవ ప్రదంగా సాగేలా చర్యలు చేపట్టామని... ఇందుకోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్లు భువనేశ్వరి పేర్కొన్నారు.

Also Read:ఏపీలో భారీగా తగ్గిన కేసులు: కలవరపెడుతున్న మరణాలు, ఒక్కరోజే ప.గోలో 20 మంది మృతి

రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నెలకొల్పుతామని ఆమె తెలిపారు. హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభిస్తామని భువనేశ్వరి వెల్లడించారు. ఇప్పటికే ఇంటివద్ద హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల కోసం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు.

మరోవైపు కరోనా బాధితుల కోసం విదేశీ వైద్యులతో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోందని భువనేశ్వరి పేర్కొన్నారు. ఆన్ లైన్ టెలీ మెడిసిన్, ఉచితంగా మందుల పంపిణీ, కోవిడ్ బాధితులకు అన్నదానం వంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన 24/7 కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు అవసమైన సేవలను అందిస్తున్నట్లు భువనేశ్వరి స్పష్టం చేశారు. 
 

click me!