Heavy Rains in AP: ఏపీని వదలని వాన.. 29న మరో అల్పపీడనం.. ఆ జిల్లాలో స్కూల్స్‌కు సెలవు..

By team teluguFirst Published Nov 27, 2021, 11:12 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరో ముప్పు పొంచి ఉంది. మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy rain alert) కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  రెండు రోజుల పాటు చిత్తూరు (Chittoor), నెల్లూరు (Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరో ముప్పు పొంచి ఉంది. మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy rain alert) కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్  29న అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలిపింది. రెండు రోజుల పాటు చిత్తూరు (Chittoor), నెల్లూరు (Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అంచన వేసింది. 

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిణారాయన్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కాజ్‌వేలు దాటరాదని హెచ్చరించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

వరదల నుంచి తెరుకుని జిల్లాలు.. కేంద్ర బృందం పర్యటన..
ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. ముఖ్యంగా కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షల కారణంగా ఏర్పడిన నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం మూడు  రోజుల పాటు ఏపీలో పర్యటిస్తుంది. శుక్రవారం.. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో వరి పంటను పరిశీలించారు. ఇక, నేడు కడప జిల్లాలో  మరో బృందం పర్యటించనుంది. రేపు నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈనెల 29న కేంద్ర బృంద సభ్యులు సీఎం జగన్‌తో సమావేశం కానున్నారు.

ఇక, రానున్న 3, 4 రోజుల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని 28 జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. 
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 13,254 క్యూసెక్కులు కొనసాగుతుండగా.. ఓట్‌ఫ్లో 19, 229 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 867. 50 అడుగుల వరకు నీరు చేరింది. 

click me!