నిరుద్యోగ యువతే టార్గెట్... రూ.20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

By Arun Kumar PFirst Published Mar 4, 2021, 10:24 AM IST
Highlights

 నిరుద్యోగ యువతను మోసం చేసి భారీగా నగదును కొట్టేసిన ఘటన తమిళనాడు కేంద్రంగా జరిగింది.    

చిత్తూరు: నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసి రూ.20కోట్లు కొట్టేశారు. తమిళనాడు కేంద్రంగా కేటుగాళ్లు ఈ మోసానికి తెరలేపగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు యువత మోసపోయారు. సినీఫక్కీలో యువతను మోసగించిన ముఠా సభ్యులు చివరకు చిత్తూరు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. 

వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దేవప్రియన్‌ చెన్నై ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ఈ క్రమంలోనే ఓ కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకుని ఎయిర్‌పోర్టులో ఉద్యోగం మానేశాడు. మంత్రి సన్నిహితుడి సహకారంతో కేంద్రమంత్రి కార్యాలయంలో ఉద్యోగులతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని మోసాలకు తెరలేపాడు.  ఈజీ మనీ కోసం నిరుద్యోగ యువతకు టార్గెట్ గా చేసుకున్నాడు.  

పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చెన్నైలకు చెందిన పలువురిని తన ఏజెంట్లుగా పెట్టుకుని రైల్వే, ఐటీ తదితర శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగ యువతకు ఆశచూపించాడు. ఇలా ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేశాడు. ఫేక్‌ ఆర్డర్‌ కాపీలు నిరుద్యోగుల చేతిలో పెట్టి నిజంగానే ఉద్యోగాలు వచ్చినట్లు భ్రమ కల్పించేవాడు. ఇలా సంపాదించిన డబ్బుతో పాండిచ్చేరి, చెన్నై ప్రాంతాల్లో భారీగా ఆస్తులు సంపాదించాడు. 

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురానికి చెందిన ఓ యువకుడు వీరిచేతిలో మోసపోయాడు. తన డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో దేవప్రియన్‌ ఓ చెక్కు రాసిచ్చాడు. సదరు యువకుడు ఆ చెక్కుతో  పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.  ముఠా నాయకుడు దేవప్రియన్ తో పాటు హరిహరకుమార్‌ అనే మరో సభ్యుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

click me!