
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో విద్యార్థినుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ప్రైవేటు కాలేజ్‌లో చదువుతున్న నలుగురు విద్యార్థినిలు కనిపించకుండా పోయారు. నలుగురు రాత్రి సమయంలో గోడ దూకి పారిపోయారు. అయితే వారు ఎక్కడికి వెళ్లారనేది తెలియడం లేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థినుల మిస్సింగ్‌పై డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాలేజ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
కాలేజ్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఆ ప్రైవేటు కాలేజ్‌లో 350 మంది విద్యార్థినులు చదువుతున్నట్టుగా తెలుస్తోంది. కనిపించకుండా పోయిన విద్యార్థినులను స్రవంతి, ప్రశాంతి, వర్షిని, శ్రీవల్లిగా గుర్తించారు. వీరు నలుగురు కూడా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని బిద్నూ ప్రాంతంలోని హర్దౌలీ గ్రామంలోని నర్సింగ్ కళాశాలకు చెందిన మహిళా టీచర్ గురువారం హాస్టల్ నుంచి కనిపించకుండా పోయారు. శనివారం ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు బిద్నూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే ఆమె ఘతంపూర్ ప్రాంతంలోని తన సోదరి నివాసానికి వెళుతున్నట్లు చెప్పినట్టుగా నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో మహిళా టీచర్ ఆచూకీ గురించి ఆమె సోదరికి ఫోన్ చేసినప్పుడు ఆమె తనకు తెలియదని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. మహిళా టీచర్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.