అమరావతి అభివృద్ది పనులపై సీఎం జగన్ దృష్టి... అధికారులతో కీలక సమావేశం

By Arun Kumar PFirst Published May 9, 2022, 4:57 PM IST
Highlights

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ శాఖ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సమీక్షించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది పనులపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో చర్చించారు. కరకట్ట రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే విద్యుత్‌ స్తంభాలను తొలగింపు పూర్తవడంతో పనులు మరింత వేగవంతం చేసామన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. 

ఇవాళ (సోమవారం) క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ శాఖ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలిచ్చారు.  

Latest Videos

''ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ లే అవుట్స్‌ ఆదర్శనీయంగా ఉండాలి. లే అవుట్స్‌ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరూ వీటిని చూసి, ఇదే మాదిరిగా లే అవుట్స్‌ ఉండాలన్న రీతిలో తీర్చిదిద్దాలి. న్యాయవివాదాలు, ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా క్లియర్‌ టైటిల్స్‌ వినియోగదారులకు ఉండాలి'' అని సీఎం సూచించారు. 

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేఅవుట్స్‌) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్‌ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్సార్, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్స్‌ పనులు జరుగుతున్నాయన్నారు. మొత్తంగా 864.29 ఎకరాల్లో లే అవుట్‌ పనులు జరుగుతున్నాయని... మే చివరినాటికి వీటిని సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. 

 క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ :

తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలు అంటే ఏమిటి? అన్నదానిపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. ఏ కలర్‌ డబ్బాలో ఏ చెత్త వేయాలి అన్నదానిపై కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీచేశామని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికి పంపిణీ చేస్తామన్నారు.  

2426 ఆటోలు ఇప్పటికే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. మిగిలినవి  ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 1123 ఇ–ఆటోలు కూడా జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని అధికారులు సీఎంకు వివరించారు. 

ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు:
 
ప్రతిరోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని... దీనిపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు సీఎం జగన్. ఇది జరుగుతోందా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు సమాచారం రావాలన్నారు.  దీనివల్ల వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావం చూపకపోతే అవి అలానే ఉండిపోతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. 

టిడ్కో ఇళ్లపై సమీక్ష:
 
''రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్‌ చేశారు. మన ప్రభుత్వం వచ్చాక వాటిపై దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటి కోసం వాటర్‌ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి లేకపోతే మళ్లీ మురికివాడలు మాదిరిగా తయారయ్యేవి. మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా మనం అడుగులు ముందుకేస్తున్నాం.
టిడ్కో ఇళ్లను ఆ మేరకు తీర్చిదిద్దాం. టిడ్కో ఇళ్ల మీద సుమారుగా రూ.5500 కోట్లు ఈ మూడేళ్లలో ఖర్చుచేశాం. రానున్న రోజుల్లో మరింత ఖర్చు చేస్తాం'' అని సీఎం జగన్ తెలిపారు. 

 విశాఖ మెట్రోపై సమీక్ష:

విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు కోసం వనరుల సమీకరణపై సీఎం అధికారులతో చర్చించారు. సమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు.  మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, దీంతోపాటు స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలని సీఎం ఆదేశించారు. పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలన్న సీఎం అధికారులను ఆదేశించారు. 

జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష:

మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్‌లపైనా సీఎం అధికారులతో చర్చించారు. ప్రస్తుతం నడుస్తున్న మహిళా మార్ట్‌ల గురించి అదికారులు సీఎంకు వివరించారు. ఈ మార్ట్ లు విజయవంతంగా నడుస్తున్నాయని అధికారులు తెలుపగా వీలైనన్ని ఎక్కువ నెలకొల్పేలా చూడాలని సీఎం సూచించారు. దీనికోసం ప్రభుత్వం నుంచి తగినంత సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళా మార్ట్‌లకోసం వివిధ ప్రాంతాల్లో మంచి భవనాలను గుర్తించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

 

click me!