కారణమిదీ: ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఏసీటీవోల సస్పెన్షన్

By narsimha lodeFirst Published Jan 24, 2023, 10:28 AM IST
Highlights

వాణిజ్య పన్నుల శాఖలో  పనిచేస్తున్న నలుగురు ఏసీటీవోలను  సస్పెండ్  చేసింది ఏపీ ప్రభుత్వం. అవినీతి ఆరోపణలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా ఈ నలుగురిపై  చర్యలు తీసుకున్నట్టుగా   ప్రభుత్వ వర్గాలు  చెబుతున్నాయి.  

అమరావతి:   వాణిజ్య పన్నుల  శాఖలో   పనిచేస్తున్న  నలుగురు ఏసీటీవోలను  రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్  చేస్తూ  మంగళవారం నాడు  ఉత్తర్వులు జారీ చేసింది.  తమ సంఘంలో   కీలకంగా  పని చేస్తున్న  ఈ నలుగురు ఉద్యోగులను లక్ష్యంగా  చేసుకుని సస్పెండ్  చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  నేతలు ఆరోపిస్తున్నారు. 

వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జీఆర్ వీ ప్రసాద్, మెహర్, సంధ్య, గడ్డం ప్రసాద్ లను సస్పెండ్  చేస్తూ  ప్రభుత్వం  ఆదేశాలు  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నలుగురు ఏసీటీవోలపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ విషయమై  గత ఏడాదిలోనే  రాష్ట్ర ప్రభుత్వం  కమిటీని ఏర్పాటు  చేసింది.ఈ కమిటీ  గత ఏడాది ఏప్రిల్ మాసంలో  ప్రాథమిక నివేదికను అందించింది.  2022 డిసెంబర్  19వ తేదీన  విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందించింది.ఈ నివేదిక ఆధారంగా   ఈ నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.   ఈ మేరకు  ఉత్తర్వులు  వెలువడ్డాయి.

రాష్ట్రంలో  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఈ  నలుగురు అధికారులు కీలకంగా  పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో  ఈ నలుగురు కూడా  ఉన్నారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న  నలుగురు ఏసీటీవోలపై  చర్యలు తీసుకోవడం  ప్రస్తుతం  చర్చకు దారితీసింది.  తమ సంఘంలో  కీలకంగా  ఉన్నందునే    ఈ నలుగురిని సస్పెండ్  చేశారని  ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ , విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే  చర్యలు తీసుకున్నట్టుగా  వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.   ఈ విషయమై  బాధిత ఉద్యోగులు,  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు  ఏం చేస్తారనే విషయమై  ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. 

 

click me!