YS Vivekananda Reddy Murder Case: సీఐ శంకరయ్య సంచలన వాంగ్మూలం

Published : Feb 23, 2022, 09:57 AM ISTUpdated : Feb 23, 2022, 10:03 AM IST
YS  Vivekananda Reddy Murder Case: సీఐ శంకరయ్య సంచలన వాంగ్మూలం

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి కీలక వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలంలో సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు. శంకరయ్య బయట పెట్టిన విషయాలను సీబీఐ చార్జీషీట్ రూపంలో కోర్టుకు సమర్పించింది.

కడప: మాజీ మంత్రి YS  Vivekananda Reddy హత్యకేసుకు సంబంధించి అప్పటి Pulivendula సీఐ శంకరయ్య సీబీఐకి కీలక వాంగ్మూలం ఇచ్చారు.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైన సాక్ష్యాలను  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మనో‌హర్ రెడ్డి ఆధ్వర్యంలో చెరిపేశారని సీఐ సీబీఐకి సాక్ష్యం ఇచ్చారు. 

వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే  తనకు ఫోన్ లో చెప్పారని  CI Shankaraiah సీబీఐకి తెలిపారు. ఈ విషయాన్ని కోర్టుకు సమర్పించిన చార్జీషీట్ లో  CBIపేర్కొంది. వివేకానందరెడ్డి బెడ్ రూమ్ లో రక్తం మరకలతో పాటు బాత్ రూమ్ లో ఆధారాలను చెరిపివేయడంలో వైఎస్ అవినాష్ రెడ్డి బృందం కీలక పాత్ర పోషించిందని సీబీఐ చార్జీషీట్ లో పేర్కొంది.

వైఎస్ వివేకానందరెడ్డి మరణించిన రోజున వైఎస్ YS Avinash Reddy పీఏ రాఘవరెడ్డి నుండి తనకు ఫోన్ వచ్చిందని సీఐ శంకరయ్య సీబీఐకి వివరించారు. ఒక బ్యాడ్‌ న్యూస్‌... అంటూ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారని చార్జీషీట్ లో  సీబీఐ తెలిపింది. పోలీసు సిబ్బందిని వివేకానందరెడ్డి ఇంటి వద్దకు పంపాలని అవినాష్ రెడ్డి కోరినట్టుగా శంకరయ్య చెప్పారు.  ఈ విషయాన్ని తాను స్థానిక డీఎస్పీకి తెలిపి ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు ఫోన్లు చేస్తుండగా ఐదు నిముషాల్లోనే దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి మరోసారి నాకు ఫోన్‌ చేశారని శంకరయ్య చెప్పారని సీబీఐ చార్జీషీట్ లో పేర్కొంది. 

 ఎందుకు ఆలస్యం అవుతోందంటూ కోప్పడ్డారు. నేను సిబ్బందితో అక్కడికి వెళ్లే సమయానికి  వివేకానందరెడ్డి ఇంటి లోపల YS Bhaskar Reddy, మనోహర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, యర్ర గంగిరెడ్డి, దొండ్లవాగు శంకర్‌ రెడ్డి, కాంపౌండర్లు వెంకటేశ్‌ నాయక్‌, జయప్రకాశ్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారని సీఐ శంకరయ్య  సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. 

ఈ ఘటనకు సంబంధించిన స్థలంలో  ఫొటోలు తీసి  ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మకు వాట్సాప్‌ ద్వారా పంపానని శంకరయ్య వివరించారు. బాత్‌ రూమ్‌ లోపల టైల్స్‌పై రక్తం, బెడ్‌ రూమ్‌లో దుప్పటిపై రక్తపు మరకలు, వివేకానందరెడ్డి తలపై బలమైన గాయాలు కనిపించడంతో ఇది గుండెపోటు కాదని వాదించానని శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.  అయితే ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి నోర్మూసుకో అంటూ  తనను  బెదిరించారని సీబీఐకి వివరించారు. సైలెంట్‌గా ఉండకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని శంకరయ్య పేర్కొన్నారని సీబీఐ ఆ చార్జీషీట్ లో తెలిపింది.

వివేకానంద రెడ్డి తల వెనుక గాయం చూసి తాను ఇనయ్‌ తుల్లాను సైతం గట్టిగా అడిగాను. అంతా పెద్దోళ్లు చూసుకుంటారని తనకు చెప్పాడని సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని చెప్పారు. సివిల్‌ డ్రెస్‌లో ఉన్న హోంగార్డు నాగభూషణ రెడ్డిని సెల్‌ఫోన్‌తో సీన్‌ మొత్తం వీడియో తీయిస్తుండగా శంకర్‌ రెడ్డి కోప్పడినట్టు శంకరయ్య సీబీఐకి వివరించారు.

 దీంతో రికార్డింగ్‌ ఆపేయాల్సి వచ్చిందన్నారు.  క్రైమ్‌ సీన్‌ పూర్తిగా కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఆధీనంలోకి తీసుకున్నారన్నారు.  వైఎస్‌ కుటుంబీకులకు చెందిన రాజారెడ్డి ఆస్పత్రి, సీఎం జగన్‌ సతీమణి భారతి తండ్రికి చెందిన గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బందిని మాత్రం గాయాలు కనిపించకుండా కుట్లు వేసేందుకు లోపలికి అనుమతించారని  సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.   మధ్య మధ్యలో అవినాశ్‌ రెడ్డి కూడా లోపలికి వెళ్లారని సీఐ గుర్తు చేసుకొన్నారు.

 కుట్లు వేసి, కట్లు కట్టడం పూర్తయ్యాక మృతదేహాన్ని పెట్టేందుకు రిఫ్రిజిరేటర్‌ బాక్స్‌ తెప్పించారు. అయితే అందులో వివేకా మృతదేహం పెట్టేందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఫిర్యాదు లేకుండా కుదరదని చెప్పాను. ‘కేసు ఏదీ వద్దు’ అని అవినాశ్‌ రెడ్డి చెప్పారు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి డిక్టేట్‌ చేసిన విధంగా వివేకానందరెడ్డి పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు రాసిచ్చారని సీఐ శంకరయ్య సీబీఐకి వివరించారు. ఈ కేసులో అవినాశ్‌ రెడ్డి, దొండవాగు శంకర్‌ రెడ్డి, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఎంవీ కృష్ణా రెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ ప్రవర్తన అక్కడ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించానని అని శంకరయ్య పేర్కొన్నారు. ఈ విషయాలను సీబీఐ చార్జీషీట్ లో పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu