
అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ IAS, IPS అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా K.S. Jawahar Reddyని నియమించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు TTD EO పోస్టులోనూ ఆయన కొనసాగుతారని స్పష్టం చేసింది. రాష్ట్ర నిఘా విభాగం చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయులును నియమించింది. ప్రస్తుతం నిఘా విభాగం చీఫ్ గా ఉన్న కెవి రాజేంద్రనాథ్ రెడ్డిని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) చీఫ్ గా బదిలీ చేసింది. ఆయనే ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా (పూర్తి అదనపు బాధ్యత) ఉన్నారు.
డీజీపీగా ఆయనకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక, ఏసీబీ చీఫ్ గా మరొకరిని నియమించే అవకాశం ఉంది. ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్న శంఖబ్రత బాగ్చీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా నియమించింది. సాధారణ పరిపాలన శాఖ (విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్) ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి పోస్టుని సైతం పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ పోస్ట్ నీ పూర్తి అదనపు బాధ్యతగా ఆయన నిర్వహిస్తారని తెలిపింది.
ఐఎఎస్ ల బదిలీలు ఇవి…
భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ల్యాండ్ అండ్ డి ఎం)గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ ని పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న జిఎస్ఆర్కెఆర్ విజయ్ కుమార్ ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర అభివృద్ధి, ప్లానింగ్ సొసైటీ సీఈఓ, ప్రణాళిక విభాగం ఎక్స్ అఫిషియో కార్యదర్శి పోస్టులనూ పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న విజయ్ కుమార్, ఇకపైనా ఆయా పోస్టులలో కొనసాగుతారు.
ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా, టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని సీఎంవోకి బదిలీ చేసిన ప్రభుత్వం, ఆర్థిక శాఖ (మానవ వనరులు) ముఖ్య కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్ కుమార్ ని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి గా నియమించింది. ఆయన గత ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (సర్వీసెస్ అండ్ హెచ్ఆర్ఎం) పోస్టులె ఇకపైనా కొనసాగుతారని తెలిపింది.
యువజన వ్యవహారాలు, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ని భూ పరిపాలన పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా నియమించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ల్యాండ్ అండ్ డిఎం) పోస్ట్ ని పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకు అప్పగించింది. యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు) రజత్ భార్గవకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది.
రవాణా శాఖ కమిషనర్ పోస్ట్ ని పూర్తిగా అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల్ని నిఘా విభాగం చీఫ్ గా నియమించడంతో, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబుకి రవాణా శాఖ కమిషనర్ పోస్టుని పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది.
ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న బాబు.ఎ కి ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రెటరీగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ను సీతారామాంజనేయులు అదనపు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు.