విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకోవడం లేదు.. అది జగన్ ఆడుతున్న డ్రామా: హర్ష కుమార్

By Sumanth KanukulaFirst Published Oct 9, 2022, 9:45 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా ఒక డ్రామా అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చకొట్టడానికి  సీఎం జగన్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. 

వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా ఒక డ్రామా అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ విమర్శించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చకొట్టడానికి  సీఎం జగన్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖ రాజధాని కావాలనే కోరిక లేదని అన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామా ఆడటం.. అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకోటానికి చేస్తున్న హైడ్రామా అని విమర్శించారు. సీఎం జగన్ చెప్పడం వల్లే వాళ్లు రాజీనామా చేస్తామని మాట్లాడుతున్నారని అన్నారు. 

విజయవాడలో హర్ష కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి  వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీఎం జగన్‌తో సహా వైసీసీ నాయకులు.. ప్రత్యేక హోదా గురించి, విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు. అటువంటి వాళ్లు రాజీనామా చేస్తానంటే ఎవరైనా ప్రజలు నమ్ముతారా?. ఉత్తరాంధ్ర ప్రజల నాడి నాకు తెలుసు. ఎవరూ కూడా విశాఖపట్నంను రాజధానిగా కోరుకోవడం లేదు. విశాఖ రాజధాని కావాలని.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో.ఎక్కడ కూడా చిన్న ఉద్యమం కూడా ప్రారంభం కాలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే.. ప్రజలు స్పందించి ఉద్యమంలోకి వచ్చారు. కానీ విశాఖపట్నం రాజధాని కోసం ఒక్కరు  కూడా మీటింగ్ పెట్టని పరిస్థితి.

వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి ప్రజలను రెచ్చగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అన్ని బెడిసి కొడతాయి. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీల గురించి ప్రయత్నం చేయండి. మూడున్నరేళ్ల పాలన కాలంలో ఒక్క డిమాండ్ కూడా సాధించుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. అంతకు ముందు పాలించిన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం సాధించలేకపోయింది. 

మూడున్నరేళ్లు చేయని రాజీనామాలు ఇప్పుడేందుకు చేస్తున్నారు?. వైసీపీ నాయకులు కూడా విశాఖ రాజధాని కావాలని కోరుకోవడం లేదు. వాళ్లంతట వాళ్లు రాజీనామా చేస్తామని చెప్పడం లేదు. సీఎం జగన్ చెప్పడం వల్లే వాళ్లు రాజీనామా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క రాజధానికే కట్టుబడి ఉంది. మూడు రాజధానులపై మేము గానీ, మా అధిష్టానం గానీ ఎప్పుడూ సపోర్ట్ చేయడం జరగలేదు’’ అని అన్నారు. 

కేసీఆర్ జాతీయ పార్టీపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన హర్ష కుమార్.. కేసీఆర్ ఆంధ్ర వాళ్లను పచ్చి బూతులు తిట్టారని, విపరీతంగా ప్రాంతీయవాదం రెచ్చగొట్టారని అన్నారు. ‘‘బిర్యానీ వండటం రాలేదని, ఉలవచారు గురించి వాళ్ల దగ్గర పశువులు తింటాయని కేసీఆర్ అన్నారు. ప్రాంతీయవాద మనస్తత్వం కలిగిన కేసీఆర్.. అక్కడ ఉద్యమం రగలించడానికి ఆంధ్ర వాళ్లను ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఆయన గొప్ప సంస్కర్తలాగా, జాతీయవాదిలాగా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. 2024 ఎన్నికల తర్వాత కేసీఆర్ పార్టీ వీఆర్ఎస్ తీసుకుంది. కేసీఆర్ లాంటి సంకుచిత భావాలున్న నేత రాణించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడ లేదు’’ అని హర్ష కుమార్ అన్నారు. 

click me!