
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఇంచార్జీ పదవికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రాజీనామా చేశారు. ఆమె భర్త కూడ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకొని అభ్యర్ధుల ఎంపిక విషయంలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు బాధ కల్గించాయని పిల్లి అనంతలక్ష్మి దంపతులు పేర్కొన్నారు.పదవులకు రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగుతామని వారు ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికలను అధికార, విపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్తానాల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
ఈ సమయంలో కాకినాడలోని టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నేతల మధ్య అధిపత్య పోరు కారణంగానే పిల్లి దంపతులు రాజీనామా చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో చోటు చేసుకొంది.
రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు గాను చంద్రబాబునాయుడు పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల అధ్యక్షులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకొంటారు.