పాపం రాంబాబు..!

First Published Sep 19, 2017, 12:05 PM IST
Highlights
  • గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే రాంబాబుని ఇప్పుడంతా అయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు.
  • నిన్న మొన్నటి వరకు ఆయన పరిస్థితి బాగానే ఉంది. కానీ..
  • ఎప్పుడైతే టీడీపీ కి రాజీనామా చేసి.. పార్టీ నుంచి బయటకు వచ్చాడో.. ఆయన తల రాత ఒక్కసారిగా మారిపోయింది.

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే రాంబాబుని ఇప్పుడంతా అయ్యో పాపం అంటూ జాలి పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన పరిస్థితి బాగానే ఉంది. కానీ.. ఎప్పుడైతే టీడీపీ కి రాజీనామా చేసి.. పార్టీ నుంచి బయటకు వచ్చాడో.. ఆయన తల రాత ఒక్కసారిగా మారిపోయింది. సంవత్సరాల పాటు మూలన పడి ఉన్న ఓ కేసులో ఇప్పుడు ఆయనకు జైలు శిక్ష పడింది.

అసలు ఏం జరిగిందంటే..మార్కాపురం పట్టణానికి చెందిన గోళ్ల సురేంద్రనాథ్‌ అనే వ్యక్తికి పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సమీపంలో 29 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. అందులో సగం భూమిని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు 2007లో కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మిగిలిన భూమిని కూడా తనకే అమ్మాలని సురేంద్రనాథ్‌పై మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువచ్చారు.

 

దీంతో ఇద్దరి మధ్య వివాదాలు నడిచాయి. ఈ విషయమై 2008 ఆగస్టు 11న అన్నా రాంబాబు తన అనుచరులతో కలిసి స్థానిక నెహ్రూబజార్‌లోని సురేంద్రనాథ్‌ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో తన భార్యను మాజీ ఎమ్మెల్యే దూషించి, దౌర్జన్యానికి పాల్పడ్డారని సురేంద్రనాథ్‌ అదే నెల 23న పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు.

 

దీంతో సురేంద్రనాథ్‌ న్యాయస్థానంలో నేరుగా ప్రైవేటు కేసు వేశారు. ఈ కేసుకు న్యాయస్థానం 2012లో నెంబరు ఇచ్చి విచారణకు స్వీకరించింది. అప్పటి నుంచి విచారణలో ఉన్న కేసుకు సంబంధించి తుది తీర్పును స్థానిక ఏజేఎఫ్‌సీ న్యాయమూర్తి సోమవారం ప్రకటించారు. తీర్పు అనంతరం అన్నా రాంబాబుకు ఇద్దరి పూచీకత్తుతో బెయిలు మంజూరు చేశారు.

 

టీడీపీ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటి వరకు ఎలాంటి చలనం లేకుండా పడి ఉన్న కేసు ..ఒక్కసారిగా రాంబాబు పార్టీ నుంచి దూరం కాగానే..  కోర్టు తీర్పు ఇవ్వడం పట్ల అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారినందుకే ఇలా జరిగిందనేది పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. నిజంగానే పాపం రాంబాబు అనాలనిపిస్తోంది.

click me!