
తండ్రి, కొడుకుల దృష్టిలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల డబ్బంతా తమ జేబులో నుండి ఇస్తున్నట్లే ఉంది. నంద్యాలలో జనాలను ఉద్దేశించి చంద్రబాబునాయడు మాట్లాడిన మాటలకు, శ్రీకాకుళంలో లోకేష్ చేసిన సవాలుకు పెద్ద తేడా కనబడటం లేదు. ఇంతకీ వైసీపీని ఉద్దేశించి లోకేష్ ఏమన్నారంటే, ‘‘రుణమాఫీలో లబ్ది పొందిన ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ డబ్బును వెనక్కు ఇచ్చాయలి’’ అన్నారు.
శ్రీకాకుళంలో లోకేష్ రుణమాపీ గురించి మాట్లాడారు లేండి. రుణమాఫీ ద్వారా ప్రతిపక్ష పార్టీలో అనేకమంది నాయకులు, ఎంపిటిసిలు, సర్పంచులు కూడా లబ్దిపొందారట. ఒక్కొక్కరికి ఎంత మాఫీ జరిగిందో ఆధారాలతో సహా లెక్కలు చెబుతారట. వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా అంటూ సవాలు విసిరారు.
దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా రూ. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతవరకూ ఓకేగానీ, రైతు రుణమాఫీని ప్రభుత్వం పార్టీల వారీగా రద్దు చేసిందా? లేక రైతైతే చాలా అన్న పద్దతిలో మాఫీ చేసిందా? అన్నది లోకేష్ చెప్పాలి. అర్హత గల రైతులకు రుణమాఫీ అంటే మళ్ళీ అందులో వైసీపీ, టిడిపి, వామపక్షాలు, కాంగ్రెస్ రైతులంటూ విడిగా వుండరు కదా?
రుణమాఫీ లబ్ది పొందిన వారిలో వైసీపీ వాళ్ళు కూడా ఉండి వుండవచ్చు. కాదని ఎవరూ అనలేరు. అంతమాత్రానా పథకం అమలులో లోపాలుంటే ఆరోపణలు చేయకూడదనో, విమర్శలు చేయకూడదనో లేదు కదా?
నిజానికి పోయిన ఎన్నికల సమయంలో చంద్రబాబు హమీ ఇచ్చిన రైతు రుణమాఫీ ప్రకటన వేరు. అధికారంలోకి రాగానే హామీ అమలవుతున్న విధానం వేరన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కాగానే ఏవేవో లెక్కలు చూపించి రైతుల సంఖ్యతో పాటు రుణమాఫీ మొత్తాన్ని కూడా బాగా కుదించేసారు. పోనీ అదన్నా సరిగా జరుగుతోందా అంటే అదీ లేదు. విడతల వారీగా, గందరగళంగా తయారైంది. ప్రభుత్వం ఏ పనినీ సక్రమంగా చేయదు కానీ దాన్ని ఎవరూ పల్లెత్తు మాట మాత్రం అనకూడదు. అంటే, ఎదురుదాడే సమాధానం.