బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు నచ్చకే తాను బీజేపీని వీడుతున్నట్టుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
గుంటూరు: బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు సరిగా లేదని ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు సోము వీర్రాజు కక్షసాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.
గురువారం నాడు అనుచరులతో సమావేశమైన తర్వాత తన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. 2014లో మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్టుగా ఆయన వివరించారు.
undefined
సామాన్య కార్యకర్త మాదిరిగానే తాను పార్టీలో పనిచేస్తున్నట్టుగా చెప్పారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు గాను తన శక్తివంచన లేకుండా పనిచేసినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక పార్టీల నుండి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమరావతి విషయంలో .జగన్ సర్కార్ అనాలోచిత విధానాల కారణంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల తరపున పోరాటం చేసినట్టుగా కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.
కరోనా తర్వాత తనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించారన్నారు. తన స్థానంలో సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. పగ, కక్షసాధింపే లక్ష్యంగా సోము వీర్రాజు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక నాయకత్వం తీరు కారణంగా బీజేపీలో ఇమడలేని పరిస్థితి నెలకొందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. దీంతో బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.
also read:బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై: నడ్డాకు రాజీనామా లేఖ
రాత్రికి రాత్రే నాయకులు కావాలనుకునే వారికి కాపు సామాజిక వర్గం నేతలు గుర్తుకు వస్తారన్నారు. ఈ కారణంగానేమో వంగవీటి రంగా గురించి జీవీఎల్ నరసింహరావు మాట్లాడారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కాపు ఉద్యమంలో తాను మొదటి నుండి ఉన్నానని ఆయన చెప్పారు. ఐదుగురు ముఖ్యమంత్రుల పని చేసిన అనుభవం తనకు ఉందన్నారు. జీవీఎల్ నరసింహరావు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. వంగవీటి రంగా పేరు జిల్లాకు పెడితే సంతోషపడివారిలో తానే మొదటివాడినని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో పనిచేసినా కూడా పదవులు ఆశించలేదన్నారు. ఎవరి వద్దకు వెళ్లి పదవులు అడగలేదని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. తన అనుచరులతో చర్చించి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.