రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన

By narsimha lodeFirst Published Aug 13, 2019, 11:37 AM IST
Highlights

పార్టీలో సీనియర్లు తప్పుకొని యువతకు అవకాశం కల్పించాలన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. తాను కూడ పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించారు.

అమరావతి: మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. మరో వైపు టీడీఎల్పీ ఉప నేత పదవికి కూడ తాను రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.

మంగళవారం నాడు టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన గుంటూరుకు వచ్చారు. ఈ సమయంలో ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడారు.

ఇప్పటికే తాను ఆరు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  తాను పోటీకి దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. మరో వైపు పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లు పార్టీ పదవుల నుండి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన నాయకత్వానికి నొక్కి చెప్పారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి కూడ తాను రాజీనామా చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.

సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు సర్కార్ అమలు చేసినా కూడ ఓటమి పాలు కావడంపై కూడ ఆయన స్పందించారు. మంత్రులు, జిల్లా, మండల నేతలు  సక్రమంగా వ్యవహరించని కారణంగానే  ఓటమి పాలు కావాల్సి వచ్చిందని  గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.

తప్పొప్పులను బేరీజు వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని  గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. పార్టీ పదవుల నియామాకాల్లో పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉందని బుచ్చయ్యచౌదరి చెప్పారు.

ఇంత అభివృద్ధి చేస్తే కేవలం 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ సీపీకి 50 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 


సంబంధిత వార్తలు

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

click me!