
విశాఖపట్టణం: మమ్మల్ని కాలితో తన్నినా కూడా సీఎం ఆశయాల సాధన కోసం ప్రయత్నిస్తామని మాజీ మంత్రి, వైసీపీ నేత దాడి వీరభద్రరావు చెప్పారు.
సోమవారం నాడు Dadi Veerabhadra Raoవిశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటు కార్యక్రమానికి ఆహ్వానం అందలేదన్నారు. ఎవరెన్ని అవమానాలు చేసినా కూడా సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు.
సీఎం ఆశయాలకు అనుగుణంగా కొత్త జిల్లాల పరిపాలన జరుగుతుందా లేదా అనేది అనుమానమేనన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములను, జిరాయితీ భూముల రికార్డులను మార్చేశారన్నారు. రెవిన్యూ అధికారులు కూడా రియల్ ఏస్టేట్ వ్యాపారులుగా మారిపోయారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని కబ్జా చేసి లే అవుట్లుగా అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు.జిల్లాలో ప్రత్యేక విభాగంతో విచారణ జరపాలన్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు ఆయన తనయుడు రత్నాకర్ కు స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు మధ్య అగాధం కొనసాగుతుంది. ఓ వర్గం దాడి వీరభద్రరావుకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని ప్రచారం సాగుతుంది.
ఇవాళ కొత్త జిల్లాల కార్యాలయాల ప్రారంభోత్సవానికి సంబంధించిన విషయమై దాడి వీరభద్రరావు మీడియా వేదికగా స్పందించారు. పార్టీలో కొందరు నేతలు తమను దూరంగా పెడుతున్నా కూడా ఏనాడూ దాడి వీరభద్రరావు బహిరంగంగా స్పందించలేదు. కానీ, ఇవాళ మాత్రం తనకు ఆహ్వానం అందలేదని దాడి వీరభద్రరావు చెప్పడం తన అసంతృప్తిని బహిర్గతం చేస్తుంది.