
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజవర్గం కుప్పం అన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తితో పాటు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోగా.. ఇప్పుడు ఆయనే అక్కడే రెవెన్యూ డివిజన్ కావాలని విజ్ఞప్తి చేసిన మేరకు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు.
పాలనా వికేంద్రీకరణే ప్రజలకు మేలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు ఇదే మా విధానమని చెప్పారు. గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడామని తెలిపారు. 1970 మార్చిలో ప్రకాశం, 1979 జూన్‌లో విజయనగర జిల్లాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఈ రెండే గత 70 ఏళ్ల చరిత్రలో ఏర్పడిన కొత్త జిల్లాలు అని చెప్పారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ రోజు కలెక్టర్ల పాత్ర కీలకంగా మారిందని చెప్పారు.
ఇక, ఏపీలో కొత్తగా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్లను కూడా నోటిఫికేషన్ పేర్కొంది. అందులో కుప్పంకు చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలోనే కుప్పం రెవెన్యూ డివిజన్ చేయాలని కుప్పం ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కుప్పంను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే ఆయన చిత్తూరు కలెక్టర్‌కు లేఖ రాశారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కుప్పంలో రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
కుప్పంపై వైసీపీ ఫోకస్..
ఇదిలా ఉంటే వైసీపీ కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కుప్పం మున్సిపాలిటీని వైసీపీ స్వాధీనం చేసుకోవడం.. ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజవర్గంలో విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది.