APPSC చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

By Sumanth KanukulaFirst Published Feb 19, 2022, 10:12 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను (Gautam Sawang) ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకన్న ఏపీ సర్కార్.. తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను (Gautam Sawang) ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకన్న ఏపీ సర్కార్.. తాజాగా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత  2019 జూన్‌లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. 2023 జూలై వరకు సవాంగ్‌కు సర్వీస్ ఉన్నప్పటికీ ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అయితే డీజీపీ బాధ్యతల నుంచి గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన ఏపీ సర్కార్ ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్ నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ఏపీ సర్కార్ శుక్రవారం పంపింది. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించి డీమ్డ్‌టూబీ రిజైన్డ్ క్లాజ్‌ను సర్కార్ ఉపయోగించుకుంది. 

ఇక, ఏపీపీఎస్సీ చైర్మన్ రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో.. సర్వీసులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ పోస్టులో చేరాలంటే సర్వీసు ముగియడమో, రాజీనామా చేయడమో జరగాలి. సవాంగ్‌‌కు వచ్చే ఏడాది జూలై వరకు సర్వీసు ఉండటంతో.. ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలంటే ఆయన ఐపీఎస్‌కి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే ఐపీఎస్‌కి రాజీనామా చేసి.. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టుగా సమాచారం. ఈ దిశగా ఏపీ ప్రభుత్వం ఆయనను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. 

గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం.. 
ఇక, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో డీజీపీ భాద్యతల నుంచి బదిలీ అయిన గౌతమ్ సవాంగ్‌కు మంగళగిరి 6వ బెటాలియన్ గ్రౌండ్‌లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సమేతంగా గౌతమ్ సవాంగ్ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. 

click me!