
హైదరాబాద్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తమ పాత్రలను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆరోపిస్తూ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు బాలకృష్ణకు, దర్శకుడు క్రిష్‌కు గురువారం నాడు లీగల్ నోటీసులు పంపారు.
ఎన్టీఆర్ బయోపిక్‌ను హైద్రాబాద్‌లో గత మాసంలో ప్రారంభించారు.ఈ చిత్రాన్ని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో తమ పాత్రల గురించి ఎటువంటి అనుమతిని తీసుకోలేదని నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్‌లో నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించిన పాత్రల విషయమై నెగిటివ్‌గా చూపే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయంతో ఉన్నారు.
దీంతో ఈ విషయమై తమ పాత్రల గురించి నెగిటివ్‌గా చూపించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న తరుణంలో నాదెండ్ల భాస్కర్ రావు పెద్ద కుమారుడు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు, దర్శకుడు క్రిష్‌కు లీగల్ నోటీసులు పంపారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత గుండె ఆపరేషన్ నిమిత్తం అమెరికాకు వెళ్లి వచ్చాడు. అయితే ఎన్టీఆర్ అమెరికా నుండి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుండి తప్పించి తాను సీఎంగా అయ్యారు.
అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించి గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించారు.ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచారు. నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కర్ రావు సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత మరోసారి ఎన్టీఆర్ సీఎం పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ పరిణామాలన్నీ ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.దీంతో నాదెండ్ల భాస్కర్ రావు పెద్ద కుమారుడు లీగల్ నోటీసులు పంపించారు.