ఎల్వీ బదిలీ: సీఎస్‌లు రెండేళ్లు పదవిలో ఉండాలి...హైకోర్టులో ఐవైఆర్ పిటిషన్

By sivanagaprasad KodatiFirst Published Nov 8, 2019, 7:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతూనే ఉంది. తాజాగా ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతూనే ఉంది. తాజాగా ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నవారిని కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేబినెట్ సెక్రటరీ, కేంద్ర హోం కార్యదర్శి, డీజీపీల తరహాలోనే సీఎస్‌లను కూడా రెండేళ్లు పదవిలో కొనసాగించాలని కృష్ణారావు తెలిపారు. ఇదే సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ విషయాన్ని పిటిషన్‌లో వెల్లడించారు.

ప్రతివాదులుగా ఏపీ ఇన్‌ఛార్జ్ సీఎస్ నీరభ్ కుమార్, జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర కేబినెట్ సెక్రటరీ, డీవోపీటీ కార్యదర్శులను పేర్కొన్నారు. కృష్ణారావు పిటిషన్ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Also Read:ప్రవీణ్ ప్రకాష్ పై ఎల్వీకి ఫిర్యాదు: ఆ అధికారిపై కూడా బదిలీ వేటు

కాగా ఎల్వీ సుబ్రమణ్యం ఇచ్చిన నోటీసుపై జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌కు వివరణ ఇస్తూ ప్రవీణ్ లేఖ రాశారు.

వైఎస్సార్ లైఫ్ టైం అవార్డులు, గ్రామ సచివాలయాల విషయంలో అప్పటి సీఎస్ నిర్ణయాల మేరకే వ్యవహరించానని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. గ్రామ న్యాయాలయాల అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాని అంశాన్ని కూడా ఎల్వీకి వివరించానని ప్రవీణ్ వెల్లడించారు.

వివరణ పట్టించుకోకుండా షోకాజ్ నోటీసు ఇవ్వడం తనను తీవ్రంగా బాధించిందని.. ప్రజలకు సత్వర న్యాయం, లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం ఏపీ కేడర్‌కు ఉన్న ప్రత్యేకతని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

Also Read:ఎల్వీని బదిలీ చేసిన నోటీసు: నిబంధనల ప్రకారమే.. ప్రవీణ్ ప్రకాశ్ క్లారిటీ

సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్.శంకరన్, ఏవీఎస్ రెడ్డి, యుగంధర్ వంటి వారి స్ఫూర్తితో ఏపీ కేడర్ పనిచేస్తుందన్నారు. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఎపిసోడ్ తెరపైకి రావడం బాధించిందని ప్రవీణ్ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతా నిబంధనల ప్రకారమే చేశానని ఆయన లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు, గ్రామ సచివాలయాలపై గత మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టారు ప్రవీణ్ ప్రకాశ్.

అయితే ఆర్ధిక శాఖ అనుమతి తీసుకోకపోవడంతో పాటు తనకు చెప్పకుండా చేయటంపై ఎల్వీ సుబ్రమణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నిబంధనలు అతిక్రమించారంటూ ప్రవీణ్ ప్రకాశ్‌కు ఎల్వీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 

click me!