వైఎస్ జగన్ కు ఝలక్: మోడీతో ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ తేదీ ఖరారు

By telugu team  |  First Published Nov 8, 2019, 4:30 PM IST

వైఎస్ జగన్ చేతిలో అవమానానికి గురైన ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రదాని నరేంద్ర మోడీని కలువబోతున్నారు. ఎల్వీ ఈ నెల 15వ తేదీన ఢిల్లీ వెళ్లి మోడీని కలుస్తారని అంటున్నారు. ఇది రాజకీయంగా మలుపు తిప్పుతుందని అంటున్నారు.


విజయవాడ:  ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తప్పించిన విషయం తెలిసిందే.  బాపట్లలోని మానవ వనరుల కేంద్రం సంచాలకులుగా ఆయనను జగన్ ప్రభుత్వం బదిలీ చేసింది. 

ఇంచార్జీ సిఎస్ గా నీరబ్ కుమార్ ను జగన్ ప్రభుత్వం నియమించింది. నీరబ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించిన ఎల్వీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సహానీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెచ్చుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు.

Latest Videos

Also Read: ప్రవీణ్ ప్రకాష్ పై ఎల్వీకి ఫిర్యాదు: ఆ అధికారిపై కూడా బదిలీ వేటు

అయితే, ఎల్వీ బదిలీపై రాజకీయం దుమారం చెలరేగుతూనే ఉంది. ఎల్వీకి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. సెలవుపై వెళ్లడం ద్వారా ఎల్వీ మంచి పనిచేశారని చంద్రబాబు అన్నారు. గతంలో ఎల్వీ అంటేనే ఒంటి కాలి మీద లేచిన చంద్రబాబు ఆకస్మికంగా ఆయనను బదిలీ చేయడాన్ని తప్పు పడుతున్నారు. 

ఎల్వీని బదిలీ చేసిన విధానం సరైంది కాదని బిజెపి నేతలు అంటున్నారు. అయితే, ఇది సర్వసాధారణమైన బదిలీ మాత్రమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బొత్స అలా చెప్పినప్పటికీ ఎల్వీ ఆకస్మిక బదిలీపై విస్మయం వ్యక్తమవుతూనే ఉంది. ఇదే సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లవచ్చుననే ప్రచారం సాగుతోంది. 

Also Read: ఎల్వీని బదిలీ చేసిన నోటీసు: నిబంధనల ప్రకారమే.. ప్రవీణ్ ప్రకాశ్ క్లారిటీ.

ఎల్వీకి మరో ఐదు నెలల సర్వీసు ఉంది. దాంతో ఆయనను కేంద్రం తన సేవలకు వినియోగించుకుంటుందనే ప్రచారం సాగుతోంది. ఇది ఒక రకంగా వైఎస్ జగన్ కు మింగుడు పడని విషయమే. కేంద్రం జగన్ ను లక్ష్యం చేసుకోవడానికి ఎల్వీని వాడుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నెల 15వ తేదీన ఢిల్లీ వెళ్తున్నారు. అదే రోజు ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని అంటున్నారు. ప్రధానితో ఎల్వీ భేటీ వ్యవహారం కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

click me!