5గురికి టిక్కెట్లు అనుమానమే? టిడిపిలో షాక్

First Published Mar 1, 2018, 2:09 PM IST
Highlights
  • ఆరోపణలు ఆధారంగా వారి స్ధానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారన్న ప్రచారం పార్టీలోనూ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోందట.

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు షాక్ ఇవ్వనున్నారా? పార్టీవర్గాలు అవుననే అంటున్నాయ్. ఎంఎల్ఏల పనితీరు, వారిపై వినిపిస్తున్న ఆరోపణలు ఆధారంగా వారి స్ధానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారన్న ప్రచారం పార్టీలోనూ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోందట. ఒకేసారి ఐదుగురు సిట్టింగులకు టిక్కెట్ల కేటాయింపులో మొండిచేయంటే మామూలు విషయం కాదు.

ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని శింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్, అనంతపురం, పుట్టపర్తి నియోజకవర్గాల ఎంఎల్ఏలపై వ్యవహారశైలిపై చంద్రబాబుకు బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉందట. అందుకని 2019 ఎన్నికల్లో కొత్త అభ్యర్ధులను పోటీలోకి దింపాలని చంద్రబాబు ఉద్దేశ్యమట. అందుకని ఇప్పటికే కొత్తవారికోసం అన్వేషణ కూడా మొదలైంది. కొందరిని పార్టీలోకి చేర్చుకున్నారు కూడా.

అటువంటి వారిలో శింగనమలలో ఎంఆర్పిఎస్ నేత ఎంఎస్ రాజును ఇటీవలే పార్టీలోకి చేర్చుకున్నారు. మంత్రి కాలువ శ్రీనివాసులే రాజును దగ్గరుండి చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి చేర్చారు. అంటే రాజు విషయంలో కాలువ ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారట. తన నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా జరుగుతున్నపరిణామాల విషయంలో సిట్టింగ్ ఎంఎల్ఏ యామినీబాల మండిపోతున్నారు.

ఇక అనంతపురం నియోజకవర్గంలో ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి విషయంలో పార్టీలో పెద్ద గందరగోళమే రేగుతోంది. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి ప్రోదల్బంతో చంద్రబాబు వైసిపిలో నుండి గుర్నాధరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే హామీతోనే రెడ్డిని చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. దాంతో చౌదరి భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది.

అదే విధంగా కల్యాణదుర్గంలో తనకు బదులుగా తన కొడుకు లేదా కోడలుకు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి ఇప్పటికే చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. అయితే, చంద్రబాబు మాత్రం పై ఇద్దరి విషయాన్ని పక్కనబెట్టి బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వర్ రావు  వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

ఇక, గుంతకల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ జితేందర్ గౌడ్ కు టిక్కెట్టు దక్కేది అనుమానమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయదుర్గం నుండి పోయిన ఎన్నికల్లో గెలిచిన మంత్రి కాలువ వచ్చే ఎన్నికల్లో గుంతకల్ నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారట. మంత్రి కోరికను చంద్రబాబు కూడా కాదనే అవకాశం తక్కువ. ఎందుకంటే, ప్రస్తుతం కాలవ మాట సిఎం దగ్గర బాగా చెల్లుబాటవుతోంది. అలాగే, పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డికి టిక్కెట్టు అనుమానమే అని పార్టీ వర్గాలంటున్నాయి.

click me!