టిడిపికి హిందుపురంలో బీటలు..వైసిపికే మొగ్గా ?

First Published Mar 1, 2018, 11:52 AM IST
Highlights
  • క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

అనంతపురం జిల్లా హిందుపురంలో టిడిపికి వచ్చే ఎన్నికల్లో బీటలు తప్పవా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏపిలోని కొన్ని నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటల్లాగా నిలిచాయి. సుమారు 40 నియోజకవర్గాల్లో టిడిపికి దాదాపుగా ఓటమన్నదే లేదు. అటువంటి నియోజకవర్గాల్లో హిందుపురం కూడా ఒకటి.

పార్టీ పరంగా అంతటి  ఘనచరిత్ర కలిగిన నియోజకవర్గంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో అన్నగారి కొడుకన్న కారణంతో జనాలు బాలకృష్ణను ఆధరించారు. అటువంటిది తన వ్యవహారశైలితో బాలకృష్ణ పార్టీని కంపు చేసుకున్నారు.

ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి నియోజకవర్గం మొత్తాన్ని అప్పట్లో పిఏగా ఉన్న చంద్రశేఖర్ కు అప్పగించేశారు. దాంతో పిఏ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో సమస్యలు మొదలయ్యాయి. పార్టీలో ఏవైనా సమస్యలు చెప్పుకోవాలంటే బాలకృష్ణ అందుబాటులో ఉండరు. ఎక్కడైనా కలిసినపుడు మాట్లాడాలన్నా ఏమైనా ఉంటే తన పిఏతో చెప్పుకోమనేవారు. పిఏ ఏమో ఎవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదు.

అదే సమయంలో బాలకృష్ణ పేరుచెప్పి పిఏ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసారని ఆరోపణలున్నాయి. అలాగే పార్టీ నేతలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. దాంతో నియోజకవర్గంలోని టిడిపి నేతలందరూ పిఏ మీద కోపంతో బాలకృష్ణపై తిరుగుబాటు లేవదీశారు. పరిస్ధితి అదుపు తప్పుతోందని గ్రహించిన చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవటంతో బాలకృష్ణ తన పిఏని తప్పించారు.

శేఖర్ ప్లేస్ లో ఇపుడు పిఏ గా ఉంటున్న అధికారి పనితీరు కూడా అలాగే ఉందట. దాంతో నేతల్లో బాలకృష్ణపై వ్యతిరేకత పెరిగిపోతోంది. అదే సందర్భంలో ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత కూడా పెరిగిపోతోంది. ఇటువంటి నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ గనుక పోటీ చేస్తే ఓటమి ఖాయమని బాగా ప్రచారం జరుగుతోంది. వైసిపి నేత, స్దానికుడైన నవీన్ నిశ్చల్ వైపు జనాల మొగ్గుందని సమాచారం.

అదే సమయంలో టిడిపి స్ధానిక నేత అంబికా లక్ష్మీనారాయణ కూడా రేసులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ పోటీ చేయకపోతే తనకు టిక్కెట్టు ఇవ్వాల్సిందిగా చంద్రబాబును అడుగుతున్నారు. ఇటు నవీన్ అటు అంబకా ఇద్దరూ స్ధానికులే కావటంతో ఇద్దరికీ నియోజకవర్గంలో పట్టుంది. అధికారపార్టీ నేత కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తే అంబికా గెలుపు సులభమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి, బాలకృష్ణ ఏమంటారో? చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

 

click me!