ఐదురుగు ఐఎఎస్ లకు జైలు శిక్ష, జరిమానా: ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు

By Arun Kumar PFirst Published Sep 2, 2021, 2:28 PM IST
Highlights

తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు దిక్కరణకు పాల్పడిన ఐదుగురు ఐఎఎస్ లకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను దిక్కరించిన ఐదుగురు ఐఎఎస్ లకు జరిమానా విధించడమే కాదు జైలుకు పంపడానికి సిద్దమయ్యింది. ఈ శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెలరోజులు గడువు ఇచ్చింది న్యాయస్థానం. 

నెల్లూరు జిల్లా తాళ్ళపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ నుండి ప్రభుత్వం భూమిని తీసుకుంది. అయితే భూమికి సంబంధించిన నష్టపరిహారం రాకపోవడంతో సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం విచారణ జరిపి మహిళకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సంబంధిత అధికారులను చాలా కాలం క్రితమే ఆదేశించింది. అయితే ఇప్పటికీ ఆమెకు నష్టపరిహారం అందకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 

తాము ఆదేశించిన తరువాత కూడా బాధిత మహిళకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహించింది. ఇందుకు కారకులుగా భావిస్తూ ఐదుగురు ఐఏఎస్ లకు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. అంతేకాకుండా ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి డబ్బులు కట్ చేసి బాధిత మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 

read more  కోర్టు దిక్కరణ... హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ లపై న్యాయమూర్తి సీరియస్

రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది న్యాయస్థానం. ఇక అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు కూడా రూ.1000 జరిమానా, రెండు వారాలు జైలు విధించారు.  అలాగే ఐఏఎస్ లు ఎస్. ఎస్ రావత్ కు నెల రోజుల జైలు రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు రూ.1000 జరిమానా,మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది హైకోర్టు. ఈ శిక్ష పై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు ఇచ్చింది న్యాయస్థానం. నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.  

ఇటీవల ఇలాగే కోర్టు ధిక్కరణ నేరంపై ఇద్దరు ఐఏఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులను రెగ్యులైజ్ విషయంలో తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం దీనిని కోర్ట్ ధిక్కరణ నేరంగా పరిగణిస్తూ ఇద్దరు ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఐఎఎస్ అధికారుల అరెస్ట్ ఆదేశాలను వెనక్కి తీసుకుంది.  

click me!