ప్రకాశంలో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు: దగ్ధమైన 100 గ్యాస్ సిలిండర్లు, ట్రాఫిక్ నిలిపివేత

By narsimha lodeFirst Published Sep 2, 2022, 10:15 AM IST
Highlights


ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ వద్ద శుక్రవారం నాడు తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని 100 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా లారీ పూర్తిగా దగ్ధమైంది. 
 


ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దద్దవాడ వద్ద శుక్రవారం నాడు తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న  లారీలో మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని 100 గ్యాస్ సిలిండర్లు పేలాయి. గ్యాస్ సిలిండర్ల లారీలో మంటలు వ్యాప్తి చెందడంతో ప్రమాదస్థలానికి సమీపంలోని నివాసం ఉంటున్నవారిని   పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కర్నూల్ జిల్లా నుండి నెల్లూరు జిల్లా ఉలువపాడుకు గ్యాస్ సిలిండర్లను లారీలో తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద  ఈ ప్రమాదం జరిగింది. 

అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై  నెల్లూరుకు లారీలో గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. లారీ క్యాబిన్ లో  ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్లకు అంటుకున్నాయి. 

ఈ లారీలో సుమారు 300లకు పైగా గ్యాస్ సిలిండర్లున్నాయి. మంటల ధాటికి సుమారు 100 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. గ్యాస్ సిలిండర్ల లారీకి మంటలు వ్యాపించిన విషయం తెలుసుకున్న పోలీసులు  ఫైరింజన్లను రప్పించారు.  అంతేకాదు జాతీయ రహదారికి ఇరువైపులా  వాహనాలను నిలిపివేశారు.  ప్రమాద స్థలానికి సమీపంలో నివాసం ఉంటున్న  స్థానికులను అక్కడి నుండి ఖాళీ చేయించారు.  ఫైరింజన్లు అతి కష్టం మీద మంటలను ఆర్పివేశాయి. 
 

click me!