చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం..

By Bukka SumabalaFirst Published Sep 2, 2022, 10:12 AM IST
Highlights

చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ లో నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. వచ్చే ఎన్నికలకోసం నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేయనున్నారు. 

అమరావతి :  నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. తాజా రాజకీయాలు, రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండేలా నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

ఇదిలా ఉండగా, టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరుతుందా అనే అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల రిపబ్లిక్ చానల్‌లో ఓ కథనం వచ్చిన తర్వాత ఆ చర్చ మరింత విస్తృతమైంది. అయితే, గురువారం చంద్రబాబు మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పందించారు. అలా ప్రచారం చేస్తున్నవారే.. దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్డీఏలో చేరిక అంశంపై ఇప్పుడే స్పందించనని చెప్పారు. ఆనాడు ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. 

మద్యం వినియోగం తగ్గింది.. ఎర్ర‌చందనం విక్ర‌యాల‌కు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే.. సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపై దృష్టి పెట్టడంతోనే పార్టీ రెండుసార్లు నష్టపోయిందని అన్నారు. ఏపీకి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనేనని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నప్పటికీ.. తెలంగాణ కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు.  ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని చెప్పారు. ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అన్నారు. 

ఇక, ఇటీవల రిపబ్లిక్ టీవీ కథనంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో కొత్త కూటమి ఏర్పడబోతుందని, ఎన్డీయేలోకి టీడీపీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టుగా ఆ చానల్ పేర్కొంది.‘‘ఎన్డీయేలోని ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ, టీడీపీలు.. తెలుగు రాష్ట్రాల పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇటీవల భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉండడంతో టీడీపీతో పొత్తుపై బీజేపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం’’ అని ఆ చానల్ కథనం ప్రసారం చేసింది. 

click me!