మాజీ మంత్రి నారాయణ అరెస్ట్: కొడుకు వర్దంతి కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

Published : May 10, 2022, 01:58 PM ISTUpdated : May 10, 2022, 02:04 PM IST
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్: కొడుకు వర్దంతి కార్యక్రమంలో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణను అరెస్ట్ చేసిన విషయాన్ని చిత్తూరు పోలీసులు ధ్రువీకరించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్‌కు సంబంధించి నారాయణను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నారాయణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన సొంత వాహనంలోనే ఏపీకి తరలిస్తున్నారు. నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నట్టుగా సమాచారం. 

అయితే నేడు నారాయణ నివాసంలో ఆయన కుమారుడు నిషిత్ వర్దంతి కార్యక్రమం జరగాల్సి ఉంది. కుమారుడి వర్దంతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే నారాయణను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈవిధంగా తీసుకెళ్లడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, నారాయణ  కుమారుడు నితీష్.. ఐదేళ్ల క్రితం ఇదే రోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

2017 మే 10వ తేదీ తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 36లో మెట్రో రైలు పిల్లర్‌ను నిషిత్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిషిత్ స్నేహితుడు రాజా రవివర్మ కూడా మరణించాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నప్పటికీ.. వాటివల్ల ఉపయోగం లేదని పోలీసులు తెలిపారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్షలు ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్  బ్రాంచీలో  టెన్త్ క్లాస్   తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో పేపర్స్ లీకేజీకి సంబంధించి శ్రీచైతన్య స్కూల్స్  పాత్ర కూడా ఉందని  స్వయంగా సీఎం జగన్ ఇటీవల తిరుపతి సభలో తెలిపారు. వ్యవస్థను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు