
వడ్డీలకు రుణాలు ఇచ్చి.. అప్పు తీసున్నవారిని పీల్చి పిప్పి చేసి.. అసలును మించి అధిక వడ్డీ రాబట్టే వడ్డీ వ్యాపారులను చాలా మందినే చూసుంటారు. కానీ... అధిక వడ్డీ కోసం కన్న కూతురినే వేధించే తండ్రిని ఎక్కడైనా చూశారా..? కృష్ణా జిల్లా గన్నవరంలో అదే జరిగింది. కన్నకూతురన్న కనికరం లేకుండా వేధించి.. హింసించి రూ.5లక్షల రుణానికి రూ.15లక్షలు గుంజాడు ఓ ప్రబుద్ధుడు. ఈ అన్యాయాన్ని సహించలేని కూతురు కలెక్టర్ కి మొరపెట్టుకోగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.... కృష్ణా జిల్లా తునికిపాడు గ్రామానికి చెందిన కిలారు హనుమంతరావు కొన్ని సంవత్సరాల క్రితం తన కుమార్తె చంద్రలేఖకు రూ.5లక్షలు ఇచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి రూ.8లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె ఆ మొత్తాన్ని ఇచ్చే సమయంలో వడ్డీతో కలిపి మొత్తం రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అయినప్పటికీ అతడి దాహం తీరక.. మరో రూ.5లక్షలు ఇవ్వాలంటూ ఇటీవల ఒత్తిడి తెస్తున్నాడు. కుమార్తె ఇవ్వకపోవడంతో ఆమెకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో పంటసాగు చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో చంద్రలేఖ తన తండ్రి వేధింపులపై కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ దర్యాప్తు చేసి హనుమంతరావుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘ కొన్నేళ్ల క్రితం మేము బెంగళూరులో స్థలం కొనుక్కుంటున్నామని చెబితే నా తండ్రి హనుమంతరావు రూ.5లక్షలు ఇచ్చారు. తొలుత బహుమతిగా ఇచ్చామని చెప్పి రెండు సంవత్సరాలు అయ్యాక మొత్తం రూ.8లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అవి ఇచ్చాక వడ్డీతో కలిసి రూ.15లక్షలు అయిందని చెప్పాడు. ఆ డబ్బులు కూడా ఇచ్చాక మరో రూ.5లక్షలు కావాలని ఒత్తిడి తెస్తున్నాడు. మాకున్న నాలుగున్నర ఎకరాల్లో పంట సాగు చేయకుండా అడ్డుకుంటున్నాడు. ఆయనపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఫిర్యాదు చేశాను’ అని హనుమంతరావు కుమార్తె చంద్రలేఖ మీడియాతో చెప్పారు.