
విశాఖపట్నం : తోటలో ఉన్న ఓ రైతులతో పిక్నిక్ కు వచ్చిన కొందరు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి రైతును తీవ్రంగా గాయపరిచారు. ముఖం, కాళ్లు, చేతులకు ఎరువుల సంచులు చుట్టేసి తుప్పల్లో పడేశారు. విశాఖ నగర పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. జీవీఎంసీ నాలుగో వార్డు పరిధిలోని జేవీ అగ్రహారానికి చెందిన కొల్లి సురేంద్ర అనే రైతు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేశాక తన బంధువైన అప్పలస్వామితో కలిసి గ్రామానికి సమీపంలోని ఎర్రమట్టిదిబ్బల్లో జీడితోట కాపలాకు వెళ్లారు.
ఆ సమయంలో 10మంది కుటుంబ సభ్యులతో ఎర్రమట్టిదిబ్బల్లోని వ్యూ పాయింట్ దగ్గరకు పిక్నిక్ కు వచ్చిన కొమ్మాది వాసి వెంకటరెడ్డికి వీరికీ మధ్య గొడవ జరిగింది. అప్పలస్వామి వీరి నుంచి తప్పించుకుని వచ్చి గ్రామస్తులకు విషయం చేరవేశాడు. తర్వాత కొందరిని తీసుకుని అక్కడికి వెళ్లేసరికి సురేంద్ర కనిపించలేదు. ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. దీంతో గుర్తుతెలియని పర్యాటకులు తన భర్తపై దాడి చేసి, అపహరించారంటూ సురేంద్ర భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్..
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, వెతకడంప్రారంభించారు. బుధవారం వేకువజామున గ్రామ పొలిమేరలో ముఖానికి సంచులు చుట్టేసి కాళ్లు చేతులు కట్టి పడేసి అపస్మారక స్థితిలో ఉన్న సురేంద్రను స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత సురేంద్రను భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించారు.