చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా చివరి ఎన్నిక!

By Mahesh KFirst Published Nov 16, 2022, 10:36 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఒక వైపు సమీకరణాలపై చర్చ సాగుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఇదే తన చివరి ఎన్నిక అని తెలిపారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని పేర్కొన్నారు.
 

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఇవే నా చివరి ఎన్నిక అని పేర్కొన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ.. గౌరవ సభ కాదని, అది కౌరవ సభ అని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ అసెంబ్లీలో నన్ను, నా భార్యను కూడా అవమానించారని పేర్కొన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని, లేదంటే ఇదే తన చివరి ఎన్నిక అని చెప్పారు. తనను గెలిపిస్తే ఈ కౌరవ సభను మళ్లీ గౌరవ సభ చేస్తా అని వివరించారు.  ఈ సందర్భంగా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాను రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెడతానని గతంలోనే స్పష్టం చేశానని తెలిపారు.

తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తాననే అసత్యం ప్రచారం కొందరు కూడబలుక్కుని చేస్తున్నారని ఆరోపించారు. అవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపబోనని వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గాన తీసుకెళ్లుతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎం తరహాలో అప్పులు చేయనని తెలిపారు. 

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లాకు ఆయన వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలోని కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు,. ఆ తర్వాత రోడ్డు మార్గం మీదుగా కోడుమూరుకు చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. నేటి రాత్రికి ఆదోనిలో బస చేయనున్న చంద్రబాబు .. రేపు, ఎల్లుండి కూడా కర్నూలు జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

click me!