
అసలే రాజకీయ పార్టీల ప్రచారంతో వేడిక్కిపోతున్న నంద్యల ఉపఎన్నికను అభిమాన సంఘాలు కూడా హోరెత్తించేందుకు రంగం సిద్దమవుతోంది. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘాలు రంగంలోకి దిగుతున్నాయి. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ కూడా నంద్యాల మున్సిపాలిటీ, గోస్పాడు మండలాల్లో రోడ్డు షోలో పాల్గొంటున్నారు. రోడ్డు షోతో సంబంధం లేకుండా బాలకృష్ణ అభిమాన సంఘాలు నియోజకర్గంలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాయి.
సరే. ఒకరి అభిమాన సంఘం ప్రచారానికి దిగితే ఇంకోరి అభిమాన సంఘాలు చూస్తూ ఊరుకోవు కదా? అందుకనే సూపర్ స్టార్ కృష్ణతో పాటు ప్రిన్స్ మహేష్ బాబు అభిమాన సంఘాలు కూడా రంగంలోకి దిగేస్తున్నాయి. అభిమాన సంఘాల కీలక నేతలతో వైసీపీ నేత, కృష్ణ సోదరుడైన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు సొమవారం సమావేశం పెట్టారు. సమావేశంలో అభిమాన సంఘాలతో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయించాలని నిర్ణయమైంది. అంటే ఇరువైపులా పెద్ద ఎత్తున వారం రోజులపాటు అభిమానసంఘాలు నియోజకవర్గంలో మోహరించనున్నాయి. వీరిద్దరి అభిమాన సంఘాల ప్రచారం బాగానే ఉంది. మరి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటేమిటి, పవన్ అభిమాన సంఘాల సంగతేంటో మాత్రం తేలలేదు.