
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మా లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు కంపెనీ ముందు ధర్నాకు దిగాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. వీరి ఆందోళనకు సీఐటీయూ, జనసేన,బీజేపీ నేతల సంఘీభావం పలికారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సాహితీ ఫార్మా లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వీరి పరిస్థితి విషమంగా ఉంది. నేడు దీని మీద ఎంక్వయిరీ చేయడానికి స్పాట్ కు ఎంక్వైరీ కమిటీ వెళ్లనుంది. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్ లోని సిఎస్ఆర్ బ్లాక్ లో చికిత్స అందిస్తున్నారు.
సాహితీ ఫార్మా అగ్ని ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమం..
నిన్నటి అగ్నిప్రమాదంలో 60 శాతం, 90 శాతం కాలిన గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిలో.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఉదయం 11 10 నిమిషాలకు అనకాపల్లిలోని సాహితీ ఫార్మా యూనిట్ వన్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఫ్యాక్టరీ మొత్తాన్ని క్షణాల్లో చుట్టేసాయి. యూనిట్ వన్ లో కంటైనర్ నుంచి సాల్వెంట్స్ డంప్ చేస్తుండగా ఒకసారిగా ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగి యార్డులోని రసాయనాలకు నిప్పు అంటుకుని రియాక్టర్ల వరకు వ్యాపించింది,
మంటలు వ్యాపించడంతో భారీ శబ్దంతో పేలుడు, మంటలు ఉధృతంగా ఎగిసిపడడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 35 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా... మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తుండగా.. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రస్తుతం వైద్యులు తెలుపుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫోమ్ ఫైర్ ఫైటర్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఐదు గంటల పాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ ఫైటర్లు కూడా గాయపడ్డారు. ఇటీవల కాలంలో జరిగిన అతి పెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదం ఇది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని గాయపడ్డ వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం, మృతులకు 25 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగిన తీరుపై సమగ్ర విచారణ జరిపించాలని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.