Tirupati Rains: తిరుపతిలో కుండపోత...చెరువులను తలపిస్తున్న రోడ్లు, జలపాతంలా తిరుమల కొండ (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 19, 2021, 7:55 AM IST
Highlights

వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి నగరం, తిరుమలలో వరద నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. 

తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ ను మళ్లీ భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇటీవల కురిసిన అతిభారీ వర్షాల నుండి తేరుకోకముందే మళ్ళీ కుండపోత మొదలయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలను మాత్రం ముంచెత్తుతున్నాయి. తిరుపతి నగరంతో పాటు ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం తిరుమలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

tirupati లో కురుస్తున్న కుండపోత వర్షానికి వరద నీరు రోడ్లపైకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లోతట్టుప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరాయి. రోడ్లపైకిచేరిన మోకాల్లోతు నీటిలో వాహనాలు కూడా ప్రయాణానికి కూడా తీవ్ర అంతరాయం కలిగి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు కాలనీల్లో వరదనీటిలో వాహనాలు మునిగిపోయాయి.  

heavy rains నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుమల రెండు ఘాట్ రోడ్లను మూసివేసారు. అలాగే నడకమార్గాన్ని కూడా మూసివేస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఇప్పటికే కాలినడకన వెళ్లే అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను నవంబరు 17, 18 తేదీల్లో మూసివేసామని... ఈ రెండు మార్గాలను ఇవాళ (నవంబర్ 19వ తేదీ) కూడా మూసివేయనున్నట్లు TTD అధికారులు తెలిపారు. నడకమార్గం, ఘాట్ రోడ్డు  రోడ్లు తెరిచే తేదీని తిరిగి ప్రకటిస్తామని తెలిపారు.

వీడియో

అలిపిరి నడక మార్గం, కనుమదారుల్లోనూ వరద ఉధృతంగా పారుతున్నది. మెట్లమార్గం జలపాతాన్ని తలపిస్తున్నది. అడవి నుంచి వరదలు జోరుగా వస్తున్నాయి. రహదారిపై చెట్లు కూలడం, కొండచరియలు విరిగిపడి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. 

read more  భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత: టీటీడీ

tirumala కొండపై భారీ వర్షం కురుస్తుండటంతో వరదనీరు కిందకు పోటెత్తుతోంది. కపిలేశ్వర స్వామి దేవాలయం వద్ద వరదనీరు ఉప్పొంగుతూ ప్రమాదకర రీతిలో కిందకు దూకుతోంది. ఇలా వరదనీటి ఉదృతికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమల ఘాట్ రోడ్ లో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి వరదనీటిలో పడటంతో ఆ నీటి ప్రవాహంలో వాహనదారుడు కొట్టుకుపోయాడు. మరికొన్ని వాహనాలు కూడా వరదనీటిలో చిక్కుకున్నాయి. 

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మరోమారు సమీక్షించారు. గురువారం అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్ సమావేశం ముగిసిన తర్వాత మరోసారి వారితో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. కురుస్తున్న వర్షాలు, ప్రభావాన్ని అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో, చెరువుల్లో ఎప్పటికప్పుడు నీటిమట్టాలను గమనించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

read more  ఏ అవసరం ఉన్నా అడగండి: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, మూడు జిల్లాల కలెక్టర్లకు ఫోన్

భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌తో సీఎం మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను తెరవాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ. వేయి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంతమేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని, ఏం కావాలన్న వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని సీఎం స్పష్టంచేశారు. లైన్‌ డిపార్ట్‌మెంట్లకు చెందిన శాఖాధిపతులు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ... తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రప్పించుకుని సహాయక చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్.

click me!