టీడీపీ కార్యకర్త హత్యకు వివాహేతర సంబంధమే కారణం..

By SumaBala BukkaFirst Published Sep 11, 2023, 3:13 PM IST
Highlights

టీడీపీ కార్యకర్త హత్యలో ఎలాంటి రాజకీయకోణం లేదని.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. 

పులివెందుల : పులివెందులలో కలకలం రేపిన చింతకాయల నాగరాజు అనే వ్యక్తి హత్య కేసులో వివాహేతర సంబంధమే కారణమని జమ్మలమడుగు డిఎస్పి నాగరాజు అన్నారు. ఆదివారం నాడు నిందితులను పులివెందుల పోలీస్ స్టేషన్లో మీడియా ముందర హాజరు పరిచారు పోలీసులు. ఈనెల 8వ తేదీన లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో చింతకాయల నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు డి.ఎస్.పి. 

చింతకాయల నాగరాజు ఘటన జరిగిన రోజు తన ఇంటి దగ్గర నుంచి మోటార్ సైకిల్ మీద టమాటా తోటకు వెళ్ళాడు. అయితే అప్పటికే అక్కడ కాపు కాచి ఉన్న కొంతమంది వేటకొడవళ్లు, గొడ్డలితో ఆయన మీద దాడి చేసి హత్య చేశారు. బొర్రా చండ్రాయుడు, బొర్రా చందు, బొర్రా చెన్నకేశవులు, బొర్రా గంగన్న, బొర్రా చిన్నికృష్ణ, బొర్రా గోపాల్ లకు ప్రమేయం ఉందని తెలిపారు.

నాగరాజుకు వివాహమయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, ఈ హత్యకు ముఖ్య కారణం నాగరాజు వివాహేతర సంబంధమే అని పోలీసులు తెలిపారు. బొర్రా చెన్నకేశవుల చెల్లెలితో నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత ఐదేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. 2018 లో నాగరాజు పులివెందులలో నివాసం ఉంటుండేవాడు. ఆ సమయంలోనే బొర్రా చెన్నకేశవులు.. అతని తమ్ముడు బొర్రా చందులతో కలిసి నాగరాజు దగ్గరికి వెళ్లారు.

పీవీ రమేశ్‌ ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌తోనే కేసు మొత్తం నడవడం లేదు: సీఐడీ వర్గాలు

అప్పటికే తన చెల్లెలితో వివాహేతర సంబంధం ఉండడంతో ఆ విషయాన్ని నిలదీశారు. దీంతో నాగరాజు వారి మీద వేటకొడవలితో దాడి చేశాడు. దీనికి సంబంధించి ఆ సమయంలో పులివెందుల పోలీస్ స్టేషన్లో నాగరాజుపై కేసు కూడా నమోదయింది. ఈ కేసు అప్పటినుంచి విచారణలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన ఈ కేసు మరోసారి విచారణకు వస్తుండడంతో ఆ కేసులో సాక్ష్యం చెప్పమని హైదరాబాదులో ఉన్న చెల్లెలిని అన్నదమ్ములు ఇద్దరు అడిగారు.

అయితే, చెల్లెలు మాత్రం తాను నాగరాజును పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ప్రస్తుతం తాను ఎనిమిది నెలల గర్భవతినని చెప్పుకొచ్చింది.  తన భర్త, పిల్లలకు కాబోయే తండ్రిపై తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పానని తెలిపింది. దీంతో బొర్రా చెన్నకేశవులు కుటుంబం కోపానికి వచ్చింది.  గ్రామంలో తమ పరువు పోతుందని దీనికి అంతటికి కారణం నాగరాజు అని కక్షపెంచుకున్నారు.

ఎలాగైనా నాగరాజును హతమార్చాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే ఈనెల 8వ తేదీన టమాట తోట దగ్గరికి వచ్చిన చింతకాయల నాగరాజును నరికి చంపేశారు. ఈ మేరకు సీఐ మద్దిలేటి, లింగాల,  తొండూరు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్న మీడియా సమావేశంలో తెలిపారు.  అంతేకాదు ఈ హత్య వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని.. కేవలం వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని తెలిపారు. 

చింతకాయల నాగరాజు టిడిపి కార్యకర్త కావడంతో.. అతని హత్య విషయంలో కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచారం చేశాయని.. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని జమ్మలమడుగు డిఎస్పి నాగరాజు తెలిపారు. చంద్రబాబు పర్యటనలో బాణాసంచా కాల్చడం వల్లనే టమాటా తోటలో నాగరాజును కాపుకాసి వేట కొడవళ్లతో నరికి చంపారని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. 

click me!