నమస్కారం కూడా చేయడు, 50 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ఇంకెక్కడ వైనాట్ 175 : జగన్‌పై మేకపాటి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 25, 2023, 9:52 PM IST
Highlights

వైసీపీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని బాంబు పేల్చారు ఆ పార్టీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. జగన్ నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయరని మేకపాటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు

వైసీపీలో ప్రస్తుత పరిణామాలు, సీఎం వైఎస్ జగన్‌పై ఆ పార్టీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఎమ్మెల్యేలకు సరైన గుర్తింపు నివ్వడం లేదని, సీనియర్లను కనీసం గౌరవించరంటూ వ్యాఖ్యానించారు. నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయరని మేకపాటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో పాటు ఆయన పక్కనున్నవాళ్లు కూడా నమస్కారం పెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైఎస్ వద్ద వుండే గౌరవ మర్యాదలు జగన్ వద్ద లేవని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేలను గౌరవించని పార్టీలు మూసుకోవాల్సిందేనంటూ మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారని, అయితే అది తనకు వద్దని జగన్‌కే చెప్పానని మేకపాటి తెలిపారు. సలహాదారుల్ని ఎమ్మెల్యేలపై పెట్టడం ఏంటన్న ఆయన.. వైసీపీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని బాంబు పేల్చారు. అన్ని తెలుసుకోకుండా వైనాట్ 175 అని ఎలా అంటారని మేకపాటి ప్రశ్నించారు. బటన్లను నొక్కి అంతా బాగుందని అనుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలివ్వకపోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Also REad: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ .. వైసీపీ నుంచి సస్పెన్షన్ : శ్రీధర్ రెడ్డి, మేకపాటి స్పందన ఇదే

కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్‌కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది. 

ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. 

దీనిపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడా తప్పు చేయలేదని తేల్చిచెప్పారు. సస్పెన్షన్ చేసినందుకు సంతోషంగా వుందన్నారు. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తానని.. తాను వెంకట రమణకే ఓటు వేశానని స్పష్టం చేశారు. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని.. నాకు 20 కోట్లు ఇచ్చారని సజ్జల దేవునిపై ప్రమాణం చేస్తారా అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కువ చేసినవారిని దేవుడు కత్తిరిస్తాడని.. వైసీపీలోని కొందరు పెద్దల వల్ల సీఎం సహా అందరూ అవమానపాలవుతారని ఆయన జోస్యం చెప్పారు. తాను చంద్రబాబుతో , బీజేపీతో మాట్లాడలేదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తన ఓటుతోనే రమణ ఎమ్మెల్సీ అయ్యాడని.. తాను జగన్‌కు వెన్నుపోటు కాదని, జగనే తనకు వెన్నుపోటు పోడిచారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

click me!