
కులాల కుమ్ములాటలో యువకులు తలదూర్చొద్దని హెచ్చరించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సోమవారం గుంటూరులోని భాష్యం విద్యాసంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అన్నారు. చదువు ర్యాంకుల కోసం కాదని.. విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోవడానికి అని ఆయన పేర్కొన్నారు. ఇష్టపడి, కష్టపడి చదవాలని.. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి కోరారు.
కేంద్ర కొత్తగా తీసుకొచ్చిన విద్యా విధానంలో ఈ విధానాన్ని పొందుపరిచారని వెంకయ్య నాయుడు అన్నారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు బానిసలు కావొద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం చిన్న సమాచారం కావాల్సి వచ్చినా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులను వెంకయ్య నాయుడు సన్మానించారు.