వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి

By Nagaraju TFirst Published Dec 31, 2018, 12:44 PM IST
Highlights

అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిన గురునాథ్ రెడ్డి  అనంతరం సొంతగూటికి చేరుకున్నారు. గురునాథ్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు సైతం వైసీపీ గూటికి చేరారు. 
 

శ్రీకాకుళం: అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిన గురునాథ్ రెడ్డి  అనంతరం సొంతగూటికి చేరుకున్నారు. గురునాథ్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు సైతం వైసీపీ గూటికి చేరారు. 

ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఆయన సోమవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ను కలిశారు. పలాస నియోజకవర్గం అక్కుపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. 

ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గురునాథ్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న పొరపాటుతో అనాడు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ప్రశ్చాత్తాపం చెందారు. అంతేకాదు ఆ తప్పును సరిదిద్దుకుంటానని కూడా స్పష్టం చేశారు.

అదే సందర్భంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చిత్తశుద్ధిలేని టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తే భవిష్యత్‌ తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని అందుకే పార్టీ వీడాలనుకుంటున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు ఏమాత్రం  చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు టీడీపీలో చేరానే తప్ప పదవులు ఆశించి కానీ స్వప్రయోజనాల కోసం కానీ టీడీపీలో చేరలేదన్నారు. అయితే చంద్రబాబు నాయుడు తాను ఆశించినట్లుగా జిల్లాను అభివృద్ధి చెయ్యకపోవడంతోనే పార్టీ మారనున్నట్లు తెలిపారు.

కేవలం సొంత అభివృద్ధే అజెండాగా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నాడని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా నీటితో కరువు జిల్లాకు సాగునీరు అందిస్తారనుకుంటే అరకొరగా చెరువులు నింపడం తప్పితే ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని గురునాథ్ రెడ్డి ఆరోపించారు. 

రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కాస్తా ఒట్టిసీమగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సాకుగా చూపుతూ బీజేపీపై బురదజల్లే విధంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. అభివృద్ధి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు.  

రాష్ట్రాన్ని విభజించిన పార్టీతో పొత్తుపెట్టుకుని చంద్రబాబు రాష్ట్రానికి ఏదో మేలు చెయ్యాలని చెప్తున్నారని ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. అనైతిక పొత్తులను ప్రజలు స్వాగతించరన్నారు. అందుకు తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. 

ఇకపోతే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనంతపురం నియోకవర్గం నుంచి గెలుపొందారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ వెంట నడిచారు. వైసీపీలో చేరారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన గురునాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో చేరే సమయానికి గురునాథ్ రెడ్డి హ్యాండ్ ఇచ్చారు. 2017 నవంబర్ 30 న టీడీపీలో చేరిపోయారు.  

ఆదివారం ప్రకటించినట్లుగానే తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటానని చెప్పిన గురునాథ్ రెడ్డి సోమవారం ఉదయం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గురునాథ్ రెడ్డితోపాటు పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

బాబుకు షాక్: టీడీపీకి గుర్నాథ్ రెడ్డి రాజీనామా
 

click me!