ఐదుగురు ఉపముఖ్యమంత్రులు మాదిరిగా 5రాజధానులు చేస్తారేమో..?: జగన్ పై మాజీ మంత్రి సుజయ్ సెటైర్లు

By Nagaraju penumalaFirst Published Aug 26, 2019, 2:11 PM IST
Highlights

ఒక్కఛాన్స్ అని అడగడంతో ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిన వారే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
 

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మైనింగ్ శాఖ మంత్రి సుజయ్ కృష్ణారంగరావు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ కు అనుభవం లేకపోవడంతో ప్రజలు పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. 

ఒక్కఛాన్స్ అని అడగడంతో ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిన వారే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఇసుక పాలసీ తీసుకువస్తామని ప్రకటించిన జగన్ 90రోజులు గడుస్తున్నా నేటికి ఎందుకు కొత్తపాలసీ ప్రకటించలేదో చెప్పాలని నిలదీశారు.  

నూతన ఇసుక పాలసీ తీసుకురాకపోవడం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో సిమెంట్ ధరను మించి ఇసుక ధర ఉందని ఆరోపించారు. వారం రోజుల్లో నూతన ఇసుక విధానాన్ని ప్రకటించకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీమంత్రి సుజయ్.

వారం రోజుల్లో నూతన ఇసుకపాలసీ అమలులోకి రాకపోతే స్పందన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని లేనిపక్షంలో ప్రత్యక్షంగా పోరాటం చేసి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. 

అమరావతి, పోలవరాన్ని నీరుగార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:
 నవ్యాంధ్ర రాజధాని అమరావతి, తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందంటూ మాజీమంత్రి సుజయ్ కృష్ణారంగరావు ఆరోపించారు. అందులో భాగంగానే పోలవరం, అమరావతి నిర్మాణం పనులను నీరుగారుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  

అమరావతి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి క్లారిటీ లేదంటూ విమర్శించారు. అమరావతిలో రాజధానిని నిర్మిస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతాయంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంా ఉన్నాయన్నారు. 

మరోవైపు పోలవరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు అక్షింతలు వేసినా ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవ్వడంతోపాటు నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోందని సూచించారు. 

పోలవరం ప్రాజెక్టకు సంబంధించి నాడు కేంద్రం అనుమతితోనే టెండర్లను ఆహ్వానిస్తే నేడు వైసీపీ తన అనుచరులకు ఇవ్వడానికి రివర్స్ టెండరింగ్ ను తెరపైకి తెస్తున్నారంటూ విమర్శించారు.

మరోవైపు పీపీఏల మీద పునరాలోచన చేయడం అవివేకమైన చర్య అంటూ ఎద్దేవా చేశారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర పెట్టుబడులపై పడుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే నేడు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. 

మున్సిపల్ మంత్రి బొత్సపై సుజయ్ సెటైర్లు:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రాజధానిపై మాట్లాడితే బాగుంటుందని కానీ బొత్స మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

సీఎం వైయస్ జగన్ విదేశీ పర్యటనలో ఉండగా బొత్స అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడతాయంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. వేలాదిమంది రైతులు తమ భూములను రాజధానికోసం త్యాగాలు చేస్తే వారిని హేళన చేసేలా మాట్లాడటం దుర్మార్గమన్నారు. 

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. రాజధానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంందో వారికే తెలియడం లేదన్నారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులు మాదిరిగానే ఐదు రాజధానిలు పెడతారేమోనంటూ సెటైర్లు వేశారు. 

బొత్స చేస్తున్న శివరామకృష్ణ కమిటీ నివేదిక అనేది ముగిసిన అధ్యయనం అని చెప్పుకొచ్చారు. ఆ కమిటీ నివేదిక వేదం కాదంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రప్రయోజనాల కోసమే అమరావతిని  రాజధానిగా ఎంపిక చేసినట్లు సుజయ్ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ అమానుషం:
ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడటాన్ని మాజీమంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఖండించారు. ముఖ్యంగా విద్యార్థుల ఉపకరవేతనాలు చెల్లించడంలో విఫలమైంది కాబట్టే విద్యార్థులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.  

click me!