
దత్తపుత్రుడు సన్నాసిన్నర సన్నాసి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోదరా అంటేనే కడుపు మండితే.. వైసీపీ కాపు ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అంటే మాకెంత కోపం రావాలని ఆయన ప్రశ్నించారు. మమ్మల్ని కొడకల్లారా అనేంత బలుపా నీది అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, వెంకయ్య సహా బీజేపీ నేతల్ని బూతులు తిట్టి, నాలుక తడి ఆరకుండానే ఆ పార్టీతో అంటకాగలేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని.. 25 మంది మంత్రుల్లో ఐదుగురు మంత్రులు కాపులేనని పేర్ని నాని స్పష్టం చేశారు.
ఎంత రెచ్చగొడుతున్నా కాపు నేతలెవరూ టీడీపీవైపు రాలేదన్న బాధతోనే పవన్ అలాంటి భాష వాడారని ఆయన ఆరోపించారు. కాపులు వైసీపీతోనే వున్నారని.. ఇకపైనా వుంటారని పేర్ని నాని స్పష్టం చేశారు. తనకు కులమే లేదని చెప్పింది నువ్వే కదా శుంఠా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ముద్రగడ కుటుంబంపై దాడి జరిగినప్పుడు నువ్వేం చేశావంటూ పేర్నినాని ప్రశ్నించారు. నాలుక చీరేస్తానంటూ పవన్‌ను ఆయన హెచ్చరించారు. మాకూ తిట్లు వచ్చని.. మేం తిట్టలేమా అంటూ పేర్నినాని మండిపడ్డారు. సీఎం జగన్‌ను నీ పార్ట్‌నర్ ఆఫీస్ నుంచి తిట్టించినప్పుడు నీకు నోరు పడిపోయిందా అంటూ నాని ప్రశ్నించారు.
దత్తపుత్రుడి ముసుగు తొలగిపోయిందన్నారు. ముసుగు వెనకాల చంద్రబాబు వున్నాడని పేర్ని నాని ఆరోపించారు. పవన్ తన ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను చంద్రబాబుకు అప్పగించేలా పనిచేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి వుంటున్నానని.. కానీ వారితో కలిసి ఉద్యమం చేయలేకపోతున్నానని పవన్ అన్నారని.. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా పవన్ కల్యాణ్ మాట్లాడారని పేర్నినాని ఎద్దేవా చేశారు. రాజకీయ ముఖచిత్రం మార్చడమంటే చంద్రబాబుతో కలిసివెళ్లడమేనని పేర్నినాని ఆరోపించారు. ముసుగు తీసి చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేందుకు పవన్ సిద్ధమయ్యారని ఆయన అన్నారు.
వైసీపీలో గుండాలు లేరని.. వున్నదంతా పవన్ వెనుకేనని, వాళ్లనే బయటకు లాక్కొచ్చి కొడతారా అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. విమానాశ్రయం వద్ద జనసేన కార్యకర్తలు.. మంత్రులను పచ్చి బూతులు తిట్టారని ఆయన మండిపడ్డారు. మంత్రి రజనిని సిగ్గుతో చచ్చిపోయేలా తిట్టారని... మరో మహిళా మంత్రి రోజాను చంపడానికి ప్రయత్నించారని పేర్ని నాని తెలిపారు. జనసేన కార్యకర్తలు కర్రల దాడిలో రోజా వ్యక్తిగత సహాయకుడి బుర్ర పగిలి తొమ్మిది కుట్లుపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మంత్రి నాగార్జున మీద చెప్పులు వేశారని, మరో బీసీ మంత్రి జోగి రమేష్‌పై దాడి చేశారని... ఇదేనా పవన్ కళ్యాణ్ సంస్కారం, జనసేన సంస్కృతి అంటూ పేర్నినాని ప్రశ్నించారు.
Also REad:బంతి.. కొట్టు.. సన్నాసి.. నాకు బొడ్డుకోసి పేరు పెట్టారా? : వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలపై పవన్ ఫైర్
తమ పార్టీ కార్యకర్తను జైలులో కొట్టారని చెప్పిన ఆయనే.. పార్టీ వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకువచ్చానని పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన చురకలు వేశారు. తాను విధానపరమైన విమర్శలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారని... సీఎం వైఎస్ జగన్‌పై, మాజీమంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి అంబటి రాంబాబు గురించి, నా గురించి మాట్లాడినవి విధానపరమైనవా? వ్యక్తిగతమైనవా? అని పేర్ని నాని ప్రశ్నించారు.
గతంలో చలమలశెట్టి సునిల్, రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గురించి మాట్లాడింది విధానపరమైందా పవన్ కళ్యాణ్? వ్యక్తిగతమైందా? అని ఆయన నిలదీశారు. చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకోవడానికి లగ్నం దగ్గరపడిందని.. దాన్ని బయటకు చెప్పలేక ప్రజల్ని , అభిమానుల్ని మోసం చేసే ప్రక్రియ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. పార్టీ పెట్టి 175 స్థానాల్లో ఒక్కచోట కూడా పోటీ చేయకపోతే ప్యాకేజ్ స్టార్ అనరా అని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనబోమని నాని పేర్కొన్నారు.