కమీషన్లకు వైన్..దందాలకు మైన్, జగన్‌ది కరెప్షన్ బ్లడ్ గ్రూప్: మహానాడులో లోకేశ్

By Siva KodatiFirst Published May 28, 2020, 6:04 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. కార్యకర్త నుంచి అధినేత వరకు అందరూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. కార్యకర్త నుంచి అధినేత వరకు అందరూ ప్రజల గురించే ఆలోచిస్తారని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. మహానాడులో ఆయన మాట్లాడుతూ... ప్రజాధనం, వనరుల దోపిడీ జగన్ డిఎన్ఏలోనే ఉందని.. ఆయనది కరెప్షన్ బ్లడ్ గ్రూప్ అని సెటైర్లు వేశారు.

ఉన్న ఇల్లు అమ్ముకునే దశలో తండ్రి సీఎం అయితే జగన్  లక్ష కోట్లు కొట్టేశారని లోకేశ్ ఆరోపించారు. ఇప్పుడు తానే సీఎం అయ్యి పంచభూతాలను దోచేస్తున్నారని.. గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగేస్తున్నాడని ఆయన విమర్శించారు.

దేశమంతా గూడ్స్ సర్వీస్ టాక్స్ జీఎస్టీ అమలవుతుంటే..ఏపీలో జగన్ సర్వీస్ టాక్స్ జేఎస్టీ అమలవుతోందని లోకేశ్ ఆరోపించారు. కమీషన్లకు వైన్..దందాలకు మైన్ ని వాడుకుంటూ అడ్డంగా దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

శాండ్, ల్యాండ్ మాఫియాలు చెప్పినట్టు అధికార యంత్రాంగం పనిచేస్తోందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం అవుతోందన్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు జే గ్యాంగ్ అక్కడ ల్యాండైపోతున్నారని లోకేశ్ చెప్పారు.

రాజధాని పేరుతో విశాఖలో పాగావేసిన ఏ2 కనుసన్నల్లో కబ్జాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే వెయ్యి కోట్ల విలువైన విశాఖ వాల్తేరు క్లబ్ స్థలం కబ్జాకు యత్నించారని, వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆక్షన్లో కొట్టేసేందుకు కొత్త స్కెచ్ వేశారని లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

5ఎకరాల దసపల్లా భూముల కాజేసేందుకు చేయని ప్రయత్నం లేదని, రూ.200కోట్ల విలువైన కార్తీకవనం ప్రాజెక్టును ఓ వైసీపీ నేత ఆక్రమించారని ఆయన ఆరోపించారు. ఏ2 విశాఖలో ల్యాండయిన 7 నెలల్లో భూకబ్జాలపై 500 కేసులు నమోదయ్యాయని, రాష్ట్రమంతా వైకాపా నేతల భూకబ్జాలపై వేల కేసులు నమోదవుతున్నాయని లోకేశ్ చెప్పారు.

నేతిబీరలో నెయ్యి వుండనట్టే.. నీతికబుర్లు చెబుతున్న జగన్ పాలనలో నీతే లేదని.. ఎన్నికలకు ముందు మద్యనిషేధం హామీఇచ్చి అధికారంలోకొచ్చాకా జగన్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని ఆయన సెటైర్లు వేశారు.

జగన్ సిండికేట్ అడుగుతున్న 50 శాతం కమీషన్ ఇవ్వలేమని ప్రముఖ కంపెనీలు చేతులెత్తేశాయని.. దీంతో విషంలాంటి బ్రాండ్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని లోకేశ్ ఆరోపించారు.

చీప్ లిక్కర్  కంటే ఘోరమైన బ్రాండ్లను అమ్ముతూ  పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని.. మద్యంలో జగన్ సర్వీస్ ట్యాక్స్ ఐదేళ్లలో 25 వేల కోట్లని లోకేశ్ జోస్యం చెప్పారు. తెలుగుదేశం పాలనలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి, వైసీపీ శాండ్ మాఫియాని రంగంలోకి దింపారని ఆయన అన్నారు.

టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.1500 ఉండగా.. నేడు రూ.10 వేలకు చేరిందంటే ఎంత ఘోరమైన అవినీతికి  పాల్పడుతున్నారో అర్థం అవుతోందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థ ఇసుక విధానం కారణంగా 70 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు.

ప్రపంచమంతా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తే.. కరోనాని క్యాష్ చేసుకోవడంలో వైఎస్ తనయుడు తనకు తానే సాటని నిరూపించుకుంటున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణం,మాస్కుల్లో,శానిటైజర్ల కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

పేదలకు సెంటు స్థలం ఇచ్చే స్కీంలో భారీ స్కాంకి పాల్పడ్డారని.. ఎకరం రూ.7 లక్షలు చేయని భూమిని రూ.70 లక్షలకు కొని ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పంచుకున్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రారంభించిన స్కీం పేరు బిల్డ్ ఏపీ.. దీనివెనుక స్కాం ఉంది.అదే జగన్ సోల్డ్ ఏపీ అంటూ ఆయన సెటైర్లు వేశారు.

గత ఏడాది కంటే రాష్ట్రం ఆదాయం పెరిగిందని, కేంద్రం నుంచి భారీగా నిధులొచ్చాయని.. అయినా ప్రభుత్వ భూములు అమ్ముతున్నారంటే ఇది జగన్ సోల్డ్ ఏపీ కార్యక్రమమేనని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ బెదిరింపులు,వసూళ్లు,బ్లాక్ మెయిలింగ్ కారణంగానే  ఏపీ నుంచి 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్టుబడులకు స్వర్గంలా ఉన్న ఏపీని నేరగాళ్ల రాజ్యంగా మార్చేశారని.. వైకాపా హయాంలో కియాకి బెదిరింపులు, పీపీఏల రద్దుతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి తెచ్చారని ఆయన మండిపడ్డారు.

ప్రజలకు పాయిజన్ వైన్ అందిస్తున్న సర్కారుని ఎండగట్టాలని.. వేలకోట్ల విలువైన మైన్లను, శాండ్ ని దోచేస్తున్న వైకాపా ముఠాలని తరిమికొట్టాలని లోకేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

click me!