ఏపీ అసెంబ్లీ ఎన్నికలు .. గుడివాడలో వంగవీటి రాధా పోటీ చేయడు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 30, 2023, 9:11 PM IST
Highlights

వచ్చే ఏపీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి టీడీపీ టికెట్‌పై వంగవీటి రాధా పోటీ చేస్తాడంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో రాధా పోటీ చేయరని అన్నారు. 
 

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాకృష్ణ గుడివాడ నుంచి పోటీ చేయరన్నారు. రాధా తన సొంత తమ్ముడిలాంటి వాడని నాని స్పష్టం చేశారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో వచ్చిన గెలుపుల్లో కాపులదే సగభాగమని ఆయన పేర్కొన్నారు. చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించనని.. టీడీపీ వాళ్లు నేను మాట్లాడిన దాన్ని కట్ పేస్ట్ చేసి వీడియోలు వదిలారని నాని ఆరోపించారు. అవి చూసి జన సైనికులు స్పందిస్తున్నారని.. జీవితంలో ఇప్పటి వరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలో తాను పాల్గొనలేదని కొడాలి నాని స్పష్టం చేశారు. 

రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామనేది కాదు.. బులెట్ దిగిందా లేదా అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్‌‌ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి.. చంద్రబాబు  ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారని కొడాలి నాని చురకలంటించారు. అందరి కోసం పనిచేస్తూ.. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ భూమిని వదిలి స్వర్గానికి వెళ్లిపోతే రాష్ట్రం నష్టపోయిందని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బతికి ఉంటే తాను రెండు ముక్కలైనా సరే.. రాష్ట్రాన్ని విడిపోనిచ్చేవారు కాదని నాని పేర్కొన్నారు. జగన్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికి ఉందన్నారు. 

ALso Read: జూ. ఎన్టీఆర్ తల్లిని తిట్టిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్‌లు ఎన్టీఆర్ వారసులా?: కొడాలి నాని

అంతకుముందు సోమవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు ఎన్టీఆర్ వారసులా? అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్‌లు శనిగాళ్లు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను.. చంద్రబాబును పొగిడించుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. వేదికపై చంద్రబాబు, లోకేష్‌ల ఫొటోలు మాత్రమే పెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ బొమ్మ వేదికపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ పాదయాత్రకు వెళ్లి మరణించిన తారకరత్న ఫొటోలు ఎందుకు లేవని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవనేని లోకేష్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. ఎన్టీఆర్‌ను 8 ఏళ్లు అత్యంత క్రూరంగా హింసించారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయనతో ఉన్న వెధవలంతా ఎన్టీఆర్ చావుకు కారణమయ్యారని విమర్శించారు. 

జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు.  నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయవవద్దని నిర్మాతలను బెదిరించారని చెప్పుకొచ్చారు.  జూనియర్ ఎన్టీఆర్‌ వాళ్ల మీటింగ్‌ రాలేదని ఆయన తల్లిని ఇష్టం వచ్చిన తిట్టిపిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు భార్య, కోడలు మాత్రమే ఆడవాళ్లా?.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆడవాళ్లు కాదా? అని ప్రశ్నించారు.  


 

click me!