మూడు రాజధానులు జరిగి తీరుతాయ్.. 2024లోపే బిల్లు : తేల్చేసిన కొడాలి నాని

By Siva KodatiFirst Published Sep 9, 2022, 5:45 PM IST
Highlights

2024 లోపు మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మాకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు కూడా అంతేనని మాజీ మంత్రి స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్తామని కొడాలి నాని అన్నారు. 
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. శుక్రవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని మహానగరాలతో పోల్చి చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. 23 సీట్లకే టీడీపీని పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని నాని ఫైరయ్యారు. 29 నియోజకవర్గాలున్న నగరాలెక్కడ...? 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. వైజాగ్ సిటీలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయని.. అక్కడ పదివేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తుందని కొడాలి నాని అన్నారు. 

పరిపాలనా రాజధానిని విశాఖకు తీసుకెళ్లడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ పరిపాలన రాజధానైతే ఆ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కొడాలి నాని పేర్కొన్నారు. మాకు అమరావతి ఎంతో విశాఖ, కర్నూలు కూడా అంతేనని మాజీ మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబుకు భజన చేస్తున్న ఎల్లో మీడియా ట్రాప్‌లో పడొద్దని కొడాలి నాని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టాలనే దానిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాలను తీసుకుని మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్తామని కొడాలి నాని అన్నారు. 

ALso REad:అమరావతి రైతుల మహా పాదయాత్ర: ఏపీ హైకోర్టు అనుమతి

చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు ఏ ఒక్కరికీ పాదయాత్ర చేయడానికి అనుమతులు రావని.. జగన్ అధికారంలోకి రాగానే కోర్టులకు వెళ్లి మరి పర్మిషన్ తెచ్చుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. కాపు ఉద్యమం సందర్భంగా ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తానంటే చంద్రబాబు అనుమతించలేదని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు కోర్టు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదో.. చంద్రబాబుకు ఎందుకు పర్మిషన్లు వస్తున్నాయో అర్ధం కాక మిస్టరీగా మారిందన్నారు.  న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా వైజాగ్, శాసన రాజధానిగా అమరావతి జరిగి తీరుతాయని నాని స్పష్టం చేశారు. మండలిలో వున్న బలంతో అప్పుడు మూడు రాజధానుల బిల్లును అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపారని ఆయన దుయ్యబట్టారు. 

ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కొడాలి నాని స్పందిస్తూ ఒక రాష్ట్రంలో అధికారంలో వుండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత అని కొడాలి నాని నిలదీశారు. భారతమ్మ ఢిల్లీ వెళ్లి వైన్ షాపులకు లైసెన్స్‌లను అడిగే ఖర్మ వుందా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. వైన్‌ షాపులు ఇవ్వండని అడుక్కునే ఖర్మ చంద్రబాబుదని, కుప్పంలో చంద్రబాబు , కొడుకు మంగళగిరిలో గెలవరని కొడాలి నాని జోస్యం చెప్పారు. 

click me!