అమరావతి రైతుల మహా పాదయాత్ర: ఏపీ హైకోర్టు అనుమతి

By narsimha lodeFirst Published Sep 9, 2022, 12:20 PM IST
Highlights

అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. ఈ నెల 12 నుండి  అమరావతి రైతలు మహా పాదయాత్రను చేపట్టాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

అమరావతి: అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు అనుమతి ఇచ్చింది. అమరావతి రైతుల ఉద్యమం వెయ్యి రోజులు పూర్తవుతున్నందున మహా పాదయాత్రకు రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 వ తేదీన అమరావతి నుండి అరసవెల్లికి మహా పాదయాత్ర చేయాలని  రైతులు నిర్ణయం తీసుకున్నారు.60 రోజుల్లో 900 కి.మీ పాదయాత్ర చేయనున్నారు..ఈ పాదయాత్రకు అనుమతి కోసం  డీజీపీని అమరావతి రైతులు కోరారు. అయితే గురువారం నాడు రాత్రి మహాపాదయాత్రకు డీజీపీ అనుమతిని నిరాకరించారు.  

600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్రలో పాల్గొనే వారి పేర్లు ఇచ్చి గుర్తింపు కార్డులు తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు హైకోర్టు అనుమతిని ఇచ్చింది. పాదయాత్ర ముగింపు రోజున బహిరంగ  సభకు  ఇప్పుడే ధరఖాస్తు చేసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ  ధరఖాస్తును పరిశీలించాలని కూడా హైకోర్టు పోలీసులను  ఆదేశించింది. 

ఈ మహా పాదయాత్రకు అనుమతి కోరుతూ గత మాసంలోనే డీజీపీకి అమరావతి రైతులు వినతి పత్రం సమర్పించారు. కానీ పోలీసుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మూడు రోజుల క్రితం అమరావతి రైతులు ఈ పాదయాత్రకు అనుమతి విషయమై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాకలు చేశారు.  ఈ  విషయమై నిన్న విచారణ జరిగిన సందర్భంగా తమకు రెండు రోజుల సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.  అయితే నిన్న సాయంత్రానికి ఈ పాదయాత్రకు అనుమతిస్తారా లేదా తేల్చాలని కూడా ప్రభుత్వ న్యాయవాదికి తేల్చి చెప్పింది.  ఇవాళ ఉదయం మొదటి కేసుగా ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ మహా పాదయాత్రకు అనుమతిని నిరాకరిస్తూ ఏపీ డీజీపీ నిన్న అర్ధరాత్రి అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు లేఖను పంపింది.

ఇవాళ ఉదయం మొదటగా ఏపీ హైకోర్టు అమరావతి రైతుల పిటిషన్ పై విచారణను నిర్వహించింది. అమరావతి రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్, వి.వి. లక్ష్మీనారాయణలు తమ వాదనలు విన్పించారు. 

గతంలో కూడ అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా పెట్టిన కేసుల గురించి   న్యాయవాది మురళీధర్ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. ఏపీ హైకోర్టు నుండి తిరుపతి వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా 70కిపైగా కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఈ నెల 12వ తేదీన గుంటూరు జిల్లాలోని గుంటూరులో వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్టణం, విజయనగరం,మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి ఆలయానికి చేరుకుంటుంది. 

click me!