
గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సందడి మొదలయ్యింది. ప్రధాన పార్టీలన్ని అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జన పడుతున్నాయి. ఈ విషయంలో అధికార వైసిపి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ పొలిటికల్ హీట్ ను పెంచింది. ఇప్పటికే పలు నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని వేరేవారిని పార్టీ ఇంచార్జీలుగా ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా అధికార పార్టీ ప్రకటించింది. ఇలా ఇంచార్జీల మార్పుతో వైసిపిలో మొదలైన అసంతృప్తి అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత పెరిగింది. తాజాగా తాడికొండ నియోజకవర్గ టికెట్ పై ఆశలు వదులుకున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తాడికొండలో వైసిపి చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమంలో కొత్తగా నియమితులైన వైసిపి ఇంచార్జీ మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తో పాటు మంత్రి జోగి రమేష్, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా తనకు తాడికొండ టికెట్ దక్కదని అర్థం కావడంతో డొక్కా కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేసారు.
తాడికొండ నియోజకవర్గంతో తనకు ఎమోషనల్ అటాచ్ మెంట్ వుందని... కొంతకాలంగా ఇక్కడి రాజకీయాల్లో తాను పాలుపంచుకున్నట్లు డొక్కా తెలిపారు. కానీ తాజా రాజకీయ పరిణమాల నేపథ్యంలో తన మనసులోని విషయాలు బయటపెట్టాలని అనుకుంటున్నానని మాజీ మంత్రి తెలిపారు. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించబోనని అంటూనే ఆయనను కలిసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు.
వీడియో
2019 ఎన్నికల్లో మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయిన విషయాన్ని ఆమె ముందే గుర్తుచేసుకున్నారు డొక్కా. పత్తిపాడులో పోటీచేసి ఓడిపోయిన తర్వాత భవిష్యత్తులో ఎన్నికలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆర్థికంగా బాగా చితికిపోయాను కాబట్టే ఎన్నికలకు దూరంగా వుండాలని అనుకున్నట్లు వెల్లడించారు. కానీ తనకు ఆశలు పుట్టించి ఇప్పుడు నిరాశ పర్చారనేలా డొక్కా వ్యాఖ్యలు చేసారు.
Also Read కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల:కడప పార్లమెంట్ నుండి పోటీ?
తాడికొండలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ ఏడాది ఆగస్ట్ 19న తనను వైసిపి సమన్వయకర్తగా నియమించారని... తనను సంప్రదించకుండానే ప్రకటన కూడా చేసేసారని డొక్కా వరప్రసాద్ గుర్తుచేసారు. సరే పార్టీ బాధ్యతలు అప్పగించింది కదా అని తాడికొండలో పనిచేసేందుకు సిద్దమయ్యాను... కానీ వారం రోజుల్లోనే తనను తొలగించారని అన్నారు. పార్టీ సర్వేల్లో తనపై వ్యతిరేకత వుందని తేలిందంటూ ఆగస్ట్ 24న తాడికొండ సమన్వయకర్త బాధ్యతల నుండి తొలగించారని అన్నారు.
ఈ పరిణామాల తర్వాత తాడికొండకు తాను దూరంగా వున్నాను... కానీ ఇటీవల మరోసారి వైసిపి పెద్దలు ఆ నియోజకవర్గ వైసిపి బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు డొక్కా గుర్తుచేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి టికెట్ తనకేనని పార్టీ పెద్దలు కాదు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇంతలో మళ్లీ ఏమయ్యిందో తెలీదు తనను కాదని మాజీ మంత్రి మేకతోటి సుచరితను తాడికొండ ఇంచార్జీగా నియమించారని డొక్కా అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తామని... సుచరిత గెలుపుకోసం పనిచేస్తానని అన్నారు. కానీ పార్టీ పెద్దలు ఒక్కసారి సీఎం వైఎస్ జగన్ ను కలిసే అవకాశం కల్పించాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు.