
మరికొద్దినెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏరివేత కార్యక్రమం చేపట్టారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత కల్పిస్తానని ఎప్పటి నుంచో చెబుతున్న ఆయన చెప్పినట్లుగానే తనకు కావాల్సిన వారినైనా నివేదికలో తేడా వస్తే పక్కనపెట్టేస్తున్నారు. ఈ లిస్టులో మంత్రులు కూడా వున్నారు. టికెట్ల నిరాకరణ, స్థానాల మార్పిడి వంటి కార్యక్రమాలతో దూకుడు మీదున్న జగన్ త్వరలోనే తొలి జాబితా రెడీ చేసే పనిలో వున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందుగా అభ్యర్ధులను ప్రకటిస్తే వారికి ప్రచారం చేసుకునే అవకాశంతో పాటు పార్టీలో తలెత్తే అసంతృప్తులను చక్కదిద్దేందుకు వీలు కలుగుతుందని జగన్ భావన.
అయితే జగన్ తీరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శ్రమ తగ్గుతోంది. వైసీపీ చీఫ్ ఎలాంటి అభ్యర్ధులను బరిలోకి దించుతారో, వారు టీడీపీ నేతలకు మించి బలవంతులైతే ఏం చేయాలనే టెన్షన్ చంద్రబాబులో వుంది. ఈ ఎన్నికలు తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య అయిన నేపథ్యంలో ఏ చిన్న తప్పూ చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలాంటి దశలో వైసీపీలో సిట్టింగ్‌ల మార్పు ప్రక్రియ బాబుకు ఊరట కలిగించినట్లయ్యింది. నువ్వు ముందు ప్రకటిస్తావా.. లేక నేను ప్రకటించాలా అన్న టెన్షన్ తప్పింది.
వైసీపీ ముందుగా అభ్యర్ధులను ప్రకటించడం వల్ల వారి సత్తా ఏంటీ..? సామాజిక నేపథ్యం..? అంగ బలం, అర్ధ బలం ఏంటన్న దానిపై చంద్రబాబుకు ఓ అవగాహన కలగనుంది. తద్వారా ఇందుకు తగిన వ్యూహాలను అమలు చేసి , వైసీపీకి పోటీ ఇచ్చే వ్యక్తులను బరిలో దించడానికి చంద్రబాబుకు కావాల్సినంత టైమ్ దొరుకుతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా గానీ, అనధికారికంగా గాని అభ్యర్ధుల కసరత్తు ప్రారంభించలేదు. జనసేనతో పొత్తు ఒక కారణమైతే, వైసీపీ వ్యూహాన్ని బట్టి నడుచుకోవాలని చంద్రబాబు భావించడం మరో రీజన్.
వీలైనంత త్వరగా జగన్ అభ్యర్ధులను ప్రకటిస్తే.. టీడీపీ అధినేత కూడా తన గేమ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా టికెట్లు ఆశిస్తున్న వ్యక్తులపై చంద్రబాబు సర్వే మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నివేదిక ఆధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి .. వైసీపీ క్యాండిడేట్లతో మ్యాచ్ చేసి వీక్‌గా వున్న వారి ప్లేస్‌లో బలమైన వ్యక్తులను రీప్లేస్ చేయాలన్నది చంద్రబాబు స్ట్రాటజీగా కనిపిస్తోంది.