పీకే స్కెచ్ వేస్తున్నాడు .. షర్మిల, విజయమ్మలను చంపేస్తారు : డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 14, 2023, 2:42 PM IST
Highlights

వైఎస్ విజయమ్మ, షర్మిల హత్యలకు కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు వివేకా హత్య జరిగిందని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. 
 

ఇటీవలి కాలంలో వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. తాజాగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ విజయమ్మ, షర్మిలకు ప్రాణహానీ వుందన్నారు. వీరిద్దరూ అత్యంత అప్రమత్తంగా వుండాలని రవీంద్రా రెడ్డి సూచించారు. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు వీరిద్దరిని హత్య చేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు వివేకా హత్య జరిగిందని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. 

అంతేకాకుండా జగన్ కోడికత్తి డ్రామా కూడా ఆడారని ఆయన పేర్కొన్నారు. కోడికత్తి దాడి వెనుక కుట్రకోణం లేదని ఎన్ఐఏ కోర్ట్ తెలిపిందని రవీంద్రా రెడ్డి గుర్తుచేశారు. తాడేపల్లి నుంచి వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తోందని.. వివేకా హత్య కేసులో ఎంతమంది అధికారులను మార్చినా నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నుంచి తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేయనని డీఎల్ స్పష్టం చేశారు. 

Also Read: వైసీపీకి సింగిల్ డిజిట్ కష్టమే.. పవన్‌కు అనుభవం లేదు, చంద్రబాబు అయితేనే : డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు

అంతకుముందు గతేడాది కూడా డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని డీఎల్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్‌కు నిజాయితీ వున్నా పాలనలో అనుభవం లేదని డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. సీఎం అయిన నాటి నుంచే జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 

వైసీపీలో వున్నందుకు అసహ్యంగా వుందన్నారు. తాను ఇంకా వైసీపీలోనే వున్నానని.. వారేమీ తనను తప్పించలేదని డీఎల్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా కేసులో సుప్రీం తీర్పు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని డీఎల్ రవీంద్రా రెడ్డి ప్రశంసించారు. 

కాగా.. కడప జిల్లా మైదుకూరు నుంచి 1978 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు ఘన విజయం సాధించారు డీఎల్ రవీంద్రా రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడైన ఆయన రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా వున్నారు. టీడీపీలోకి రావాలని ప్రయత్నించినప్పటికీ.. స్థానిక నేత పుట్టా సుధాకర్ యాదవ్ బలంగా వుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. అయితే 2019లో వైసీపీకి జై కొట్టిన డీఎల్‌కు జగన్ సరైన గుర్తింపునివ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

click me!