జగన్ బ్రోకర్ సజ్జల కూడా చంద్రబాబును హేళన చేసేవాడే...: మాజీ మంత్రి బండారు సీరియస్

By Arun Kumar PFirst Published Jul 25, 2021, 2:07 PM IST
Highlights

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు 500 రోజులనుంచీ పోరాడుతున్న కార్మికులకు మద్ధతుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిరసన శిబిరాలు సందర్శించి సంపూర్ణ మద్ధతు ప్రకటించారని అన్నారు. 

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎప్పటినుంచో పోరాటం సాగిస్తోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. నిజాయితీ, విశ్వసనీయతలేని జగన్మోహన్ రెడ్డి దగ్గర బ్రోకర్ పనులుచేసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మా నాయకుడు చంద్రబాబు నాయుడిది కపట నాటకమని అనడం విడ్డూరంగా వుందన్నారు. సజ్జలకు విశాఖ ఉక్కు గురించి, దాని చరిత్ర, గొప్పతనం గురించి ఏమీ తెలియదని అతని మాటల్లోనే తెలిసిపోయిందన్నారు మాజీ మంత్రి. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు 500 రోజులనుంచీ పోరాడుతున్న కార్మికులకు మద్ధతుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిరసన శిబిరాలు సందర్శించి సంపూర్ణ మద్ధతు ప్రకటించారని అన్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా ఎప్పటికప్పుడు కార్మికులకు మద్ధతుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి తెలిపారు.  

''పీ.వీ. ప్రధానిగా ఉన్నసమయంలో విశాఖఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు చేసింది. అయితే అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది. ఆసమయంలో ముఖ్యమత్రిగా ఉన్న చంద్రబాబు  నాయుడు ప్రధాని వాజ్ పేయ్ కు లేఖరాసి  విశాఖస్టీల్ గొప్పతనాన్ని ఆయనకు వివరించడం జరిగింది.  విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు  నినాదంతో దాదాపు 32మంది ప్రాణత్యాగంతో ఏర్పడిందని చెప్పి  ప్రైవేటీకరణను అడ్డుకోవడం జరిగింది.ఆనాడు విశాఖ ఉక్కకోసం పోరాడుతున్న పరిరక్షణ సభ్యులు నేరుగా ప్రధానిని కలిసేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది'' అని గుర్తుచేశారు.

read more  ఆగష్టు 1,2 తేదీల్లో ఛలో పార్లమెంట్: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాల పాదయాత్ర

''ఆనాడు చంద్రబాబు విజ్ఞప్తి మన్నించి ప్రధాని రూ.1328కోట్లను ఈక్విటీగా మార్చి ప్రైవేటీకరణ జరగక్కుండా చేశారు. అంతేగాకుండా ఆనాడు 3.5 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తిని తరువాత 7.5 మిలియన్ టన్నులకు పెరిగేలా చేసిన ఘనతకూడా చంద్రబాబుదే.  అలాంటి చంద్రబాబుని పట్టుకొని గ్రామ సర్పంచ్ గా కూడా గెలవలేని సజ్జల హేళన చేయడం  సిగ్గుచేటు'' అని మాజీమంత్రి మండిపడ్డారు. 

''సజ్జలకు విశాఖపట్నం చరిత్ర ఏమిటో కూడా తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర బ్రోకరేజ్ చేస్తూ ఏదిపడితే అది మాట్లాడుతున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ గేటువద్దకు వచ్చి కార్మికులతో మాట్లాడే సమయంలేని సీఎం ఆ ప్లాంట్ ను పరిరక్షిస్తాడంటే ఎవరూ నమ్మరు.  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న ఒకేఒక్క కారణంతోనే జగన్ ను చంద్రబాబు విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ముందుకురావాలని కోరడం జరిగింది. అంతేతప్ప ఆయనేదో చేస్తాడని... పోటుగాడని కాదు'' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
''అమరావతి భూముల విషయంలో సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టినట్లు తీర్పుఇచ్చినా కూడా సజ్జల ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు.  సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లు జీవితాంతం జైల్లో ఉన్నా వారికి బుద్ధిరాదు'' అని మండిపడ్డారు.

''ప్రభుత్వమిచ్చే జీతంతో బతికే సజ్జల కూడా చంద్రబాబు గురించి, విశాఖ ఉక్కు ఉద్యమం గురించి అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదు. సజ్జలకు నిజంగా దమ్ము, ధైర్యముంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పి తక్షణమే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలి. వైసీపీ ఎంపీలు కపట నాటకాలు కట్టిపెట్టి, చిత్తశుద్ధితో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో పోరాడాలి'' అని మాజీ మంత్రి సత్యనారాయణ మూర్తి సూచించారు. 


 

click me!