మంత్రి పదవి రానందుకు బాధాపడ్డా.. కార్యకర్తల జోలికొస్తే ఊరుకోను, జగన్‌కు చెప్పినా భయపడను: బాలినేని

By Siva KodatiFirst Published May 11, 2022, 6:41 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యస్ధీకరణపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. రెండోసారి తనను పదవిలో కొనసాగించకపోవడంపై బాధపడ్డానని ఆయన చెప్పారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించనని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. 
 

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ నేపథ్యంలో  పలువురు సీనియర్లను మంత్రి పదవుల నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు సీఎం వైఎస్ జగన్ (ys jagan) . అలా మంత్రి పదవి పోయిన వారిలో ఒకరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) ఒకరు. సీఎంకు అత్యంత సన్నిహితుడు, దగ్గరి బంధువైన ఆయనకు రెండోసారి అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో బాలినేని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

ఒకానొక దశలో ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishan reddy) తదితర పెద్దలు బాలినేనిని బుజ్జగించారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ స్వయంగా బాలినేని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని.. మంత్రి పదవి రాకపోవడంతో కాస్త బాధపడ్డ విషయం నిజమేనని, కానీ రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేశ్​తో (adimulapu suresh) తనకెప్పుడు విభేదాలు లేవని, మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. వైఎస్సార్​​ కుటుంబానికి తాము ఎప్పటినుంచో సన్నిహితులమని, వారికి విధేయులుగానే ఉంటామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తామని చెప్పారు.

తాజాగా మంత్రి పదవి పోవడంపై బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని.. తాను గతంలో మంత్రి పదవిని వదులుకుని వైసీపీలోకి వచ్చానని ఆయన గుర్తుచేశారు. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించనని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తనపై సీఎంకు ఫిర్యాదులు చేసినా భయపడనని.. మంత్రి పదవి అడిగాను కానీ, సురేష్‌కు మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పలేదని బాలినేని వెల్లడించారు. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన (ap cabinet reshuffle) సంగతి తెలిసిందే .11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది.  సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు  వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. అటు వీరికి మద్ధతుగా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా వున్నాయి. 
 

click me!