నెల్లూరులో మరోసారి ఫ్లెక్సీ వార్.. బ్యానర్ కనబడితే ఊరుకోనన్న అనిల్ యాదవ్, టార్గెట్ ఎవరో మరి..?

Siva Kodati |  
Published : Jan 21, 2023, 02:47 PM IST
నెల్లూరులో మరోసారి ఫ్లెక్సీ వార్.. బ్యానర్ కనబడితే ఊరుకోనన్న అనిల్ యాదవ్, టార్గెట్ ఎవరో మరి..?

సారాంశం

నెల్లూరులో మరోసారి వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఈ నెల 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలకు అనుమతి లేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని ఆయన స్పష్టం చేశారు. 

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఈ నెల 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలకు అనుమతి లేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అప్పట్లో కాకాణికి మంత్రి పదవి లభించిన కొత్తల్లో నెల్లూరులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాకాణి ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారు. దీంతో ఇది అనిల్ వర్గీయుల పనేనంటూ ఆరోపించారు. చివరికి వ్వవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. తాజాగా ఇప్పుడు అనిల్ కామెంట్స్ మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ నెల 26 నుంచి ఫ్లెక్సీలు కనబడటానికి వీల్లేదన్న ఆయన.. తర్వాత తనపై ఆరోపణలు చేయొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారని.. ఇకపై అలా కుదరని అనిల్ కుమార్ అన్నారు. హోర్డింగ్స్‌కు కూడా క్లాత్‌వి వేసుకోవాలని.. ఫ్లెక్సీ తయారీదారులకు కూడా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

ఇకపోతే..మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిర్వేదంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రి పదవి నుంచి తొలగించి మంచి పనిచేశారని వ్యాఖ్యానించారు. పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.. ఎవరు వుండరో అర్ధమైందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పలువురు కార్పోరేటర్లు తనను వీడినా బాధపడనని.. 2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లు తనను విడిచిపెట్టారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు తనను ఎందుకు వీడారో అర్ధం కాలేదన్నారు. తనను వీడినవాళ్లు అనిల్ అన్యాయం చేశాడా.. అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచించారు. 

ALso Read: నా మంత్రి పదవి పీకేసి జగన్ మంచే చేశారు : అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

తన ప్రత్యర్ధి రూ.180 కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ రూ.100 కోట్లు పైబడి ఆస్తులు వున్నవారు వున్నారని ఆయన తెలిపారు. వేదిక మీద అంతా వెయిట్ వున్నవాళ్లు వున్నారని.. తనకు వెయిట్ లేదని తనను పిలవలేదేమో అంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో పోట్లు కొత్త కాదని ఆయన అన్నారు. రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు.. కొంతమంది వెళ్తారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు తనకు చాలా కష్టం అంటున్నారని.. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని ఆయన అన్నారు. ప్రజలే తన వెంట వున్నారని అనిల్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!