రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది... మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Jan 21, 2023, 1:47 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేస్తూ వస్తోంది. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని చెబుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేస్తూ వస్తోంది. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని చెబుతోంది. అయితే ఈ అంశం ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మూడు రాజధానుల నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విశాఖ, కర్నూలులో నిర్వహించిన సభలకు వైసీపీ మద్దతు ప్రకటించింది. అంతా తానై వ్యవహరించింది. 

ఈ క్రమంలోనే త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది.  అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కాలపరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై గత నవంబర్‌లో స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. 

అయితే విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వం అయితే అక్కడ ప్రభుత్వం ఎందుకు? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని ప్రశ్నలు సంధించింది. హైకోర్టు తన పరిధిని అతిక్రమించినట్టుగా  కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించడంపై సుప్రీం కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. 

click me!