
అమరావతి: మద్య నిషేదం చేస్తానని హామీనిచ్చి మహిళల ఓట్లు దండుకొన్న జగన్ రెడ్డి నేడు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. భారీగా ధరలు పెరగడంతో మద్యం కొనేందుకు డబ్బులు లేక వెనకా ముందు ఆలోచించకుండా శానిటైజర్ తాగి చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నేడు విజయవాడలో ఇద్దరు కార్మికులు శానిటైజర్ తాగి మృతి చెందటం బాధాకరమన్నారు.
''రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో పాటు నాశిరకం మద్యం రావడంతో గత్యంతరం లేక శానిటైజర్, నాటు సారా తాగి దాదాపు 50 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా, ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుటినట్లుగా కూడా లేదు. ఎవరు ఏమైపోయిన పర్వాలేదు మద్యం ద్వారా వచ్చే మా ఆదాయం, కమీషన్లు తగ్గకూడదని జగన్ రెడ్డి భావించటం మహిళలకు నమ్మక ద్రోహం చేసినట్లే'' అన్నారు.
read more వైసీపీ తరపున 22 గొర్రెలు.. టీడీపీ నుంచి మూడు పులులు, మరో పులిని గెలిపించండి : అచ్చెన్నాయుడు
''దేశంలో ఎక్కడా లేని నాశిరకం బ్రాండ్లు ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంచుకొని తమ ఇష్టానుసారంగా ధరలు పెంచేసి ఆదాయం దండుకుంటున్నారు. అటువంటి మద్యం తాగితే దీర్ఘకాలికంగా ప్రజలు రోగాల భారిన పడతారని తెలిసినా ప్రజల ప్రాణాలతో చలగాటాలాడుతున్నారు. జగన్ రెడ్డి తుగ్లక్ మద్యం విధానానికి మహిళలు తప్పకుండా బుద్ది చెబుతారు'' అని ఆలపాటి హెచ్చరించారు.